రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స‌స్సెన్ష‌న్

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం కూడా ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే  రాజ్యసభ పక్ష నేత  పీయూష్‌ గోయల్‌ ఆప్‌ ఎంపి రాఘవ్‌ చద్దాను సస్పెండ్‌ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. రాఘవ్‌ చద్దాను సస్పెండ్‌ చేయడంతో పాటు మరో ఎంపి సంజయ్  సింగ్‌ సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ ప్రకటించారు.  

రాఘవ్ చద్దా నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా వ్యహరించినట్లు చెప్పిన ఆయన దీనిపై సభా హక్కుల కమిటీ నివేదిక ఇచ్చే వరకు అతడిని సస్పెండ్‌ చేయాలని పీయూష్ గోయల్ కోరారు.  దీంతో అతడిని సస్పెండ్‌ చేసినట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు.  అనంతరం ఇరు సభలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా తర్వాత ప్రతిపక్షాలు సభకు హాజరు కాలేదు.

ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లుకు సంబంధించిన తీర్మానంలో ఐదుగురు ఎంపిల సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆప్‌ ఎంపి రాఘవ్‌ చద్దాపై ప్రివిలేజ్‌ కమిటీ తన నివేదికలను సమర్పించే వరకు రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ తెలిపారు. తమ అనుమతి లేకుండా తమ పేర్లను ఆగస్టు 7న తీర్మానంలో పొందుపరిచారని నలుగురు  రాజ్యసభ ఎంపిలు పేర్కొన్నారు. 

రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ బుధవారం ఎంపిల ఫిర్యాదులను ప్రివిలేజెస్‌ కమిటీకి పంపారు. ఎంపిలు సస్మిత్‌ పాత్ర, ఎస్‌ ఫాంగ్నాన్‌ కొన్యాక్‌, ఎం తంబిదురై, నరహరి అమీన్‌ తమను అడగకుండానే తమ పేర్లను హౌస్‌ ప్యానెల్‌లో చేర్చారని రాఘవ్‌ చద్దాపై ఆరోపణలు చేశారు. రాఘవ్‌ చద్దాను ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తోందని ఆప్‌ కేంద్రంపై   ధ్వజమెత్తింది.  రాఘవ్‌ చద్దాపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఇవి రాజకీయ ప్రేరేపితమని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాఘవ్‌ చద్దాను బిజెపి లక్ష్యంగా చేసుకుంటుందని మండిపడింది.