ఐపిసి స్థానంలో భారతీయ న్యాయ సంహిత

బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు కేంద్ర ప్రభుత్వం ఇక చెల్లు చీటీ పాడనుంది. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానాల్లో కొత్త చట్టాలు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా రాజద్రోహం వంటి చట్టాలను తొలగిస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. కొత్త చట్టాలతో 90 శాతానికి పైగా నేరగాళ్లకు శిక్షలు ఖాయమని పేర్కొన్నారు.
దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటీష్ పాలకుల కాలంలో తీసుకువచ్చిన సీఆర్‌పీసీ, స్వాతంత్రం అనంతరం తెచ్చిన ఐపీసీ చట్టాల ద్వారానే ఇప్పటివరకు నేరం చేసిన వారికి కోర్టులు శిక్షలు విధిస్తున్నాయి. 1860 నుంచి 2023 వ‌ర‌కు దేశంలో న్యాయ వ్య‌వ‌స్థ‌.. బ్రిటీష‌ర్లు రూపొందించిన విధంగానే అమ‌లు అయ్యింద‌ని పేర్కొన్నారు.
ఆ మూడు చ‌ట్టాల‌ను మార్చేసి, క్రిమిన‌ల్ జ‌స్టిస్ సిస్ట‌మ్‌లో పెను మార్పులు తీసుకురానున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలాసార్లు సుప్రీంకోర్టు సహా వివిధ హైకోర్టులు కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.  దీంతో చాలా మార్పులతో కొత్త చట్టాలను తీసుకువస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న  మూడు చట్టాలు బ్రిటీష్‌ పాలనను రక్షించడం, బలోపేతం చేయడంతో పాటు శిక్షించడం తప్ప న్యాయం చేయడం కాదని తెలిపారు. వాటిని భర్తీ చేయడం ద్వారా, కొత్త మూడు చట్టాలు భారత పౌరుల హక్కులను పరిరక్షించే స్ఫూర్తిని తీసుకువస్తాయని లోక్‌సభలో పేర్కొన్నారు.  పౌరులను శిక్షించడం లక్ష్యం కాదని, న్యాయం కల్పించడమే ఈ కొత్త చట్టాల లక్ష్యమని స్పష్టం చేశారు.
నేరాలను అదుపు చేసేందుకు శిక్షలు విధించబడతాయని చెప్పారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ చట్టాల స్థానాల్లో కొత్త చట్టాలు తేవాలనే ఉద్దేశంతో వాటికి సంబంధించిన 3 బిల్లులను లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ప్రవేశపెట్టారు.  సమాజ సేవను శిక్షగా గుర్తించడం, దర్యాప్తులో సాంకేతికత, ఫోరెన్సిక్ సైన్సెస్‌ను ఉపయోగించడం, ఎలెక్టానిక్ పద్ధతి ద్వారా సమన్లు జారీచేయడం, ఎలెక్టానిక్, డిజిటల్ రికార్డులను సాక్షంగా అంగీకరించడం వంటివి ఈ బిల్లులో ప్రభుత్వం పొందుపరిచింది. 

 
 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపిసి ), క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌ (సిర్‌పిసి) , ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ చట్టాలను సవరిస్తూ కేంద్ర హోంమంత్రి  మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టారు. భారతీయ సంహిత-2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత్‌ -2023, భారతీయ సాక్ష్య బిల్లు -2023 లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపుతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు.
 
ఇండియన్ పీనల్ కోడ్ – ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ – సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, ఎవిడెన్స్‌ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం తెస్తామని వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా  బ్రిటీష్‌ కాలంలో చేసిన కాలం చెల్లిన చట్టాలను ప్రక్షాళన చేస్తున్నామని, ఇందులో భాగంగానే రాజద్రోహం వంటి చట్టాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా తీసుకురానున్న చట్టాలతో 90 శాతంపైగా నేరగాళ్లకు శిక్షలు ఖాయంగా పడతాయని తెలిపారు. ఏడేళ్లకు పైగా శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్‌ తనిఖీ తప్పనిసరి చేస్తున్నామని వెల్లడించారు.
 
కొత్త చ‌ట్టాల‌తో శిక్ష‌ను పెంచ‌డం కాదు అని, న్యాయం దొరికేలా రూపొందించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కొత్త క్రిమిన‌ల్ చ‌ట్టాల ప్ర‌కారం మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్ష విధించ‌నున్నారు. ఇక గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డితే 20 ఏళ్లు లేదా జీవిత‌ఖైదు శిక్ష విధించ‌నున్నారు. సామూహిక దాడి కేసుల్లోనూ మ‌ర‌ణ‌శిక్ష విధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.