ఏ పిల్లలను, మహిళలను రాజకీయాల్లోకి లాగొద్దు

“నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి. ఇది ఒక త‌ల్లిగా నా అభ్య‌ర్ధ‌న మాత్ర‌మే” అని ప్రముఖ నటి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఏపీలోని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారితీయడంతో పవన్‌పై సినిమా, వెబ్‌ సిరీస్‌ చేస్తామని ఇటీవల కొంతమంది పేర్కొనడం, ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఆ వివాదం గురించి తనకు పెద్దగా అవగాహన లేదని చెబుతూ ఒక తల్లిగా తన వ్యక్తిగత అభ్యర్థన కోసం అంటూ విడాకులు తీసుకున్న దీర్ఘ‌కాలం త‌ర్వాత రేణు తొలిసారిగా ప‌వ‌న్ గురించి త‌న ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియోను విడుద‌ల చేశారు. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండని అందులో ఆమె కోరారు. తమ పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారని,  పిల్లల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు అని ఆమె గుర్తు చేశారు.
 
“ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే” అని ఆమె చెప్పారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తన విష‌యంలో వంద శాతం త‌ప్పు చేసినా ప్ర‌జా సేవ కోసం ఆయ‌న చేస్తున్న కృషికి ఎప్పుడూ తన ప్రొత్సాహం ఉంటుంద‌ని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.
 
రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఎల్ల‌ప్పుడు ఆయ‌న‌కు త‌న‌మ‌ద్దతు ఇస్తున్నాన‌ని ఆమె పేర్కొన్నారు. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే త‌లంపుతోనే కుటుంబానికి దూరమ‌య్యార‌ని , ప్ర‌జా సేవ కోసం నిరంత‌రం త‌పించే వ్య‌క్తి ఆయ‌న అని ఆమె చెప్పుకొచ్చారు. పవన్‌ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
 
”మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నా. నేను జీవితంలో ముందుకు సాగిపోతున్నా. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకూ ఆయన అరుదైన వ్యక్తి. ఆయన మనీ మైండెడ్‌ కాదు. డబ్బుపై ఆసక్తి లేదు. సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం పని చేయాలనుకుంటున్నారు” అంటూ రేణు దేశాయ్ తెలిపారు. 


“రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించండి. ఆయనొక విజయవంతమైన నటుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని  పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి” అంటూ ఆమె అభ్యర్ధించారు.