2024 ఎన్నికల్లో అన్ని రికార్డులను బద్దలు కొడతాం

‘‘భారతదేశం మాపై పదే పదే విశ్వాసం ఉంచింది.  2024 ఎన్నికల్లో ఎన్‌డిఎ, బిజెపి అన్ని రికార్డులను బద్దలు కొట్టి, ప్రజల ఆశీర్వాదంతో భారీ విజయం సాధిస్తుంది. తిరిగి అధికారంలోకి వస్తుంది”అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాలు ఎన్‌డిఎకు అదృష్టమని చెబుతూ 2019లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, సంవత్సరం తర్వాత  బీజేపీ మళ్లీ భారీగా ప్రజాధరణ పొందిందని గుర్తు చేశారు. 

 అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానం ఇస్తూ దేశం ప్రతిపక్షాలను చూస్తోందని, పార్టీలు చెప్పేవన్నీ ప్రజలు వింటున్నారని, అయితే అవి ప్రజలకు నిరాశ తప్ప మరేమీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. 2014, 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, గత రికార్డులన్నింటినీ చెరిపివేస్తామంటూ ధీమాగా చెప్పారు.

 ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మోదీ తప్పుపట్టారు. అసలు ఎలాంటి చర్చ పెట్టారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విపక్షాలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వచ్చాయని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు తమ టీమ్‌ను సరిగ్గానే ఆర్గనైజ్ చేసుకున్నప్పటికీ- ఫోర్లు, బౌండరీలను కొట్టడం మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు మోదీ. దేశ ప్రజలు తమ ప్రభుత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని, 2014లోనే కాకుండా ఆ తర్వాత ఎన్నికల్లోనూ సంపూర్ణ మెజారిటీతో తమను గెలిపించారని మోదీ గుర్తు చేసుకున్నారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైన మూడు రోజుల్లో అనేక అంశాలపై చర్చలు జరిగాయని, అయితే ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందిన ఇతర రోజుల్లో ప్రతిపక్షాలు సభను నడపనివ్వలేదని ప్రధాని విమర్శించారు. వారికి ప్రజల గురించి చింత లేదు, వారి ప్రధాన లక్ష్యం రాజకీయాలు మాత్రమే అంటూ మండిపడ్డారు. 

బిల్లులు గ్రామస్తులు, పేదలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజల సంక్షేమం.. భవిష్యత్తుకు సంబంధించినవి చాలా ఉన్నాయని చెబుతూ కానీ వారికి దీనిపై ఆసక్తి లేదని దుయ్యబట్టారు. పని చేయడానికి పార్లమెంటుకు పంపిన ప్రజల నమ్మకాన్ని వారు దెబ్బతీశారని ప్రధాని విమర్శించారు. 

దేశం కంటే తమ పార్టీ ముఖ్యమని నిరూపించారని, వారికి పేదల ఆకలి కాదు, అధికారం కోసం ఆరాటం.. యువత భవిష్యత్తుపై ఆందోళన కాదని చెబుతూ.వారి భవిష్యత్తుపై ఆందోళన ఉందని ప్రధాని ఎండగట్టారు. ప్రతిపక్షంలో ఉన్న నా సహోద్యోగులను అడగాలనుకుంటున్నాను అంటూ మీరు ఎందుకు సిద్ధంగా ఉండకూడదు? ప్రశ్నించారు. 

“కొంచెం కష్టపడండి. సిద్ధం కావడానికి మీకు ఐదేళ్ల సమయం ఇచ్చాను. 2018వ సంవత్సరం (ఆ సంవత్సరం అవిశ్వాస తీర్మానం తర్వాత)లోనే చెప్పాను. మీరు కచ్చితంగా మళ్లీ అవిశ్వాసంతో రావాలని. కానీ, ఐదేళ్లలో మీరు ఏమీ చేయలేకపోయారు. మీరంతా ఏ స్థితిలో ఉన్నారో దేశం గమనిస్తోంది” అని ప్రధాని మోదీ విపక్షాలను ఎద్దేవా చేసారు.

తమ దృష్టి మొత్తం దేశాభివృద్ధిపైనే ఉందని, ప్రతి గంట కూడా దానికే కేటాయిస్తామని ప్రధాని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడం, ఉద్యోగాల సృష్టి, ప్రపంచ దేశాలకు ధీటుగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. వంటి అంశాలకే తాము ప్రాధాన్యత ఇస్తోన్నామని స్పష్టం చేశారు. అవినీతి రహిత పరిపాలనను అందించడమే లక్ష్యమని చెప్పారు. 
 
కొన్ని ప్రతిపక్ష పార్టీలకు ఇవేవీ పట్టట్లేదని, పని చేసే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోన్నాయని మోదీ విమర్శించారు. అందులో భాగంగానే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని చెప్పారు. పేదల ఆకలికి బదులుగా ఎంతసేపు తమ అధికార దాహాన్ని తీర్చుకోవడానికే ప్రయత్నిస్తోన్నాయని ధ్వజమెత్తారు.