గద్దర్ కు అధికార లాంఛనాలు అమరులకు అవమానమే!

గద్దర్ కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని  కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల  యాంటి టెర్రరిజం ఫోరం (ఏటీఎఫ్) తీవ్ర అభ్యంతరం తెలిపింది. తెలంగాణాలో నక్సలైట్ (మావోయిజం) వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసుల, సామజిక కార్యకర్తలు, సాధారణ పౌరుల త్యాగాలను అవమానించడమే అని ఫోరమ్ కన్వీనర్  డా. రావినూతల శశిధర్ విమర్శించారు. 
 
గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి అని, తెలంగాణాలో హింసాయుత రాజకీయాలకు అండగా నిలిచిన వ్యక్తి అని, హింసకు వ్యతిరేకంగా నిలబడిన అనేకమంది నిరాయుధులు వారి చేతులలో దారుణంగా హత్యలకు గురయ్యేందుకు దోహదపడిన వ్యక్తి అని ఆయన గుర్హ్టు చేశారు. 
 
 ప్రజాస్వామ్యానికి వ్యతిరేఖంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందని, నక్సలిజం (మావోయిజం) సాధారణ పౌరులపై, జాతీయ వాదులపై కూడా   దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ప్రజాస్వామ్య పంథాలో పనిచేస్తున్న దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు కూడా వారి హత్యాకాండకు బలయ్యారని చెప్పారు. 
 
ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేఖంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను `దేశ ద్రోహులు’గా తయారు చేసిన గద్దర్ లాంటి ఒక వ్యక్తికి నేడు తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం పట్ల డా. శశిధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో, శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను, ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందని హెచ్చరించారు. 
 
కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి నిర్ణయాలు పోలీసు బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులు ప్రతి ఒక్కరు ఖండించాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో పోలీసు అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయని ఆయన చెప్పారు. 
 
పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ  అనాలోచిత నిర్ణయంపై నోరు విప్పి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోనేలా చూడాలని ఆయన కోరారు. దీనిని ఒక వ్యక్తికి జరుగుతున్న అంత్యక్రియలుగా మాత్రమే చూడకూడదని చెబుతూ అధికారికంగా అంత్యకియలు జరిపితే ప్రభుత్వం నక్సలైట్ (మావోయిజం) భావజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుందని స్పష్టం చేశారు.