ఆర్ఎస్ఎస్ శాఖకు హాజరైన గద్దర్

ప్రజా గాయకుడు గద్దర్ (గుమ్మడి విట్టల్ రావు) మృతి పట్ల దిగ్భ్రాంతి, సంతాపం ప్రకటించిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తాను ముఖ్యశిక్షక్ గా ఉన్నప్పుడు తన ఆహ్వానంపై గద్దర్ మూడు రోజులపాటు సంఘ్ శాఖకు హాజరయ్యారని గుర్తు చేసుకున్నారు.  నాలుగు, ఐదు రోజుల క్రితమే వారు అనారోగ్రానికి గురైనట్లు తెలిసి టెలిఫోన్ ద్వారా మాట్లాడి త్వరగా కోలుకొని తిరిగి సమాజ సేవలో నిమగ్నం కావాలని కోరుతున్నట్లు తెలిపానని, దానికి వారు బదులిస్తూ  మీ ఆశీర్వాదాలతో తప్పక కోలుకుంటానని తనకు తెలిపినట్లు దత్తాత్రేయ  ఈ సందర్భంగా తెలిపారు.

పిన్న వయస్సునుండి తామిద్దరం గౌలిగూడ ప్రాంతంలో నివసించేవారమని పేర్కొంటూ 1966 – 67లో తాను ఆర్ఎస్ఎస్ ముఖ్య శిక్షక్ గా పనిచేస్తన్నప్పుడు గద్దర్ రిసాలఅబ్దుల్లా  (మొజిమ్ జాహి  మార్కెట్)  వద్ద ఒక ఎస్ సి వసతి గృహంలో ఉండేవారని, వారిని తాను ఆర్ఎస్ఎస్ లోనికి ఆహ్వానించానని చెప్పారు. 

గద్దర్  2 – 3 రోజులు ఆర్ఎస్ఎస్ శాఖకు వచ్చారని, అయితే, తదుపరి నక్సలైట్ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారని తెలిపారు. ప్రముఖ సాంస్కృతిక గాయకునిగా అనేకమైన పేద, దళిత, గిరిజనుల దీన స్థితిపై, సమాజంలోని అసమానతలపై గొంతెత్తి పాడి, లక్షలాది మందిని ఆకర్షించిన గొప్ప కళాకారుడని దత్తాత్రేయ కొనియాడారు.  

గద్దర్  మృతి కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు తీరని లోటు అని చెబుతూ తాను ఎప్పుడు ఆహ్వానించినా ప్రతి సంవత్సరం నిర్వహించే “అలై బలై” కార్యక్రమంలో పాల్గొని, తనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని, ఆతిధ్యం స్వీకరించేవారని గుర్తు చేసుకున్నారు. సిద్ధాంత భావజాలం ఉన్నప్పటికీ తనతో కలిసి అనేక కార్యక్రమాలతో బాటు తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు.

కాగా, ప్రజా సమస్యలపైన మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గద్దర్ అంటూ మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు సంతాపం ప్రకటించారు.  కోట్లాది మందిని ఆకర్షించిన కంఠం మూగబోవడం మనస్తాపాన్ని కలిగించిందని తెలిపారు. సిద్ధాంత పరమైన వైరుద్యం ఉన్నప్పటికి ప్రజా సమస్యల కోసం వారు ఎంతో మంది నాయకులను కలవడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. 

కిషన్ రెడ్డి సంతాపం

ప్రజా యుద్ధ నౌకగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటుచేసుకున్న విప్లవ గాయకుడు గద్దర్ మృతి పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన గద్దర్  తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటతో, తన మాటతో సరికొత్త ఊపును తీసుకొచ్చారని గుర్తు చేశారు. 

విశ్వవిద్యాలయాల వేదికగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడిన సమయంల ‘పొడుస్తున్న పొద్దమీద నడుస్తున్న కాలమా!’ అన్న గద్దర్ పాట ఓ సంచలనం అని పేర్కొన్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో చాలా సందర్భాల్లో వేదిక పంచుకునే అవకాశం లభించిందని చెబుతూ రాష్ట్ర సాధనకు సంబంధించిన ఎన్నో అంశాలను పరస్పరం పంచుకునే అవకాశం కూడా దొరికిందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2012లో తాను చేపట్టిన ‘తెలంగాణ పోరుయాత్ర’ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో గద్దర్ తనతో కలిసి నడిచారని కిషన్ రెడ్డి చెప్పారు.