
మొత్తం నాలుగు రాష్ట్రాల మీదుగా సాగే జాతీయ రహదారి 65 (ఎన్‌హెచ్ 65) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పూణ నుంచి మచిలీపట్నం వరకు హైదరాబాద్ – విజయవాడ మీదుగా ఉన్న ఈ రహదారిని ఇప్పటికే కొంతవరకు 6 లైన్ల రహదారిగా నిర్మితమై ఉంది. అయితే విజయవాడ నుంచి బందరు వరకు నాలుగు వరసలు రహదారిగానే ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవేను ఆరు వరుసల రహదారిగా తీర్చి దిద్దేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటికే బందరు పోర్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. బందరు పోర్టు పనులు మొదలైన నాటి నుంచి ఈ రహదారి మరింత రద్దీగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే ఈ విస్తరణకు సంబంధించి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తయారు చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను కూడా ఆహ్వానించి వాటిని పూర్తి చేసింది. కేడీఎం ఇన్‌ఫ్రా అనే సంస్థ డీపీఆర్ తయారి కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. టెండర్ నిబంధనల ప్రకారం ఈ సంస్థ రహదారి విస్తరణ నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమైంది.
ఇప్పటివరకు విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి నాలుగు వరుసల్లో విస్తరించి ఉంది. గతంలో ఈ రహదారి కేవలం రెండు వరుసల రహదారిగా ఉన్నప్పటికీ ఐదేళ్ల క్రితం దీనిని నాలుగు వరుసలుగా విస్తరించారు. బందరు పోర్టు నిర్మాణ పనులు మొదలైన క్రమంలో రైల్వే శాఖ కూడా కనెక్టివిటీని పెంచే పనిలో నిమగ్నమైంది.
డిసెంబర్ నాటికి డీపీఆర్ నివేదికను ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేసి ఆ వెంటనే ఆరు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలన్న ఆలోచనలో ఎన్‌హెచ్‌ఏఐ ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి విస్తరణకు అవసరమైన భూ సేకరణను చేసే పనిలో ఎన్‌హెచ్‌ఏఐ నిమగ్నమైంది. భవిష్యత్‌లో ఈ రహదారిని 8 వరుసలకు విస్తరించాలన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాలని ఆలోచిస్తోంది.
More Stories
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు
తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు
గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం