టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. గతంతో కూడా ఈయన టీటీడీ ఛైర్మన్ గా పనిచేశారు. టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్‌ రెడ్డి రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తనను టీటీడీ ఛైర్మన్‌గా నియమించినందుకు కరుణాకర్ రెడ్డి సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈనెల 16తో ప్రస్తుత పాలకమండలి పదవి కాలం ముగియనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి అనంతరం నూతన టీటీడీ చైర్మన్‌గా భూమనకరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నూతన ఛైర్మన్ ను సీఎం జగన్ నియమించారు.  తిరుపతి ఎమ్మెల్యే భూమన గతంలోనూ టీటీడీ ఛైర్మన్, పాలక మండలిలో సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు భూమన టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు.  రెండేళ్ల పాటు ఆయన టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి 2019లో టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టి వరుసగా రెండు పర్యాయాలు ఆ పదవిలో ఉన్నారు. టీటీడీలో ఛైర్మన్ తో పాటు 35 మంది పాలక సభ్యులు ఉన్నారు.
 
ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగానే కాకుండా టీటీడీ ఎక్స్‌అఫీషియా సభ్యుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మినబంటుగా భూమనకు పేరుంది. కాంగ్రెస్ పార్టీతో భూమన రాజకీయ అరగ్రేటం చేశారు. 2004-06 వరకు తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్ (తుడా) ఛైర్మన్‌గా, ఆ తర్వాత రెండేళ్లపాటు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. 
 
2009లో తిరుపతి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మెగాస్టార్ చిరంజీవిపై ఓడిపోయారు. వైఎస్ మరణాంతరం వైసీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్ వెంటే ఉంటున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి తొలిసారి తిరుపతి ఎమ్మెల్యేగా గెలవగా, 2014లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణపై కేవలం 708 ఓట్ల తేడాతో గెలుపొందారు