రణరంగంగా మారిన చంద్రబాబు పుంగనూరు పర్యటన

టీటీడీ అధినేత  చంద్రబాబు నాయుడు రాయలసీమ పర్యటన ఉద్రిక్తతల మధ్య నడుస్తోంది. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు, దాడులు చోటుచేసుకున్నాయి.  ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు యత్నించాయి.
 
చంద్రబాబు రోడ్ షోను అడ్డుకునేందుకు ఆయనపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వగా.. ఎన్‌ఎస్‌జీ కమాండోలు అడ్డుగా నిలబడ్డారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా అంగళ్లు దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తల పరస్పర గొడవకు దిగారు. ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు
 
చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ- టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఫలితంగా అక్కడంతా తీవ్ర ఉద్రిక్త  వాతారణం నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఇందులో పలువురికి గాయలయ్యాయి. ఈ ఘటనలో రెండు పోలీస్ వాహనాలు ధ్వంసమైంది. చాలా ప్రైవేటు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చింవేశారు.ఆతర్వాత జరిగిన గొడవల్లో టీడీపీ ఎంపీటీసీ దేవేందర్ గాయపడ్డాడు. పోలీసులు సర్దిచెప్పినా రెండు వర్గాలు వినకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రవేశించినది మొదలు చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రాళ్ల దాడి జరగటంతో చంద్రబాబు ఎన్ఎస్ జీ కమాండోలు అప్రమత్తమయ్యారు. బుల్లెట్ ఫ్రూప్ ని ఓపెన్ చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన పలు వీడియోలను తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఈ విధమైన దాడులు జరగడంతో చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 “పెద్దిరెడ్డీ! నువ్వూ నీ అనుచరులు కర్రతో వస్తే నేను కర్రతో వస్తా.. నువ్వు యుద్ధం ప్రకటిస్తే నేను యుద్ధం ప్రకటిస్తా.. నీ పతనం ప్రారంభమైంది” అంటూ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే రా తేల్చుకుందామని సవాల్ విసిరారు.
 
 జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌పై ఇటీవల జరిగిన దాడులపై కేంద్రం సీరియస్ అయ్యింది. దీంతోపాటు లోకేశ్ యువగళం పాదయాత్రకు కల్పించిన భద్రత వివరాలను కూడా కేంద్ర హోంశాఖ కోరింది. అదేవిధంగా గత ఏడాది నవంబర్ 4న నందిగామలో చంద్రబాబు ర్యాలీలో జరిగిన రాళ్ల దాడిపై కూడా హోంశాఖ నివేదిక ఇవ్వాలని కోరింది.
 
 ఏమాత్రం జాప్యం చేయకుండా చంద్రబాబు, లోకేశ్‌లకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని డీజీపీ, సీఎస్‌లను హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మొత్తం అన్ని విషయాలపై జూలై- 27న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. అయితే, ఇంతవరకూ కేంద్రానికి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.