ఎన్నికల్లో చావో రేవో.. తేల్చుకుంటాం

“రానున్న ఎన్నికల్లో చావో రేవో.. తేల్చుకుంటాం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి సైనికుడిలా పనిచేస్తా” అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలోని పార్టీ కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న బండి సంజయ్ ప్రకటించారు. 
 
 పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ తొలిసారి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు వేలాదిగా శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి ర్యాలీగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన కేసీఆర్ కుటుంబ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు.
 
గత 9 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏనాడూ పట్టించుకోని సీఎం కేసీఆర్ ఎన్నికలు దగ్గరకొస్తుండంతో వాటిని నెరవేరుస్తానంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, రుణమాఫీ, పీఆర్సీ అమలు, వీఆర్ఏ, జేపీసీల రెగ్యులరైజేషన్ వంటి హామీలన్నీ కేసీఆర్ ఎన్నికల స్టంట్ లో భాగమేనని స్పష్టం చేశారు. 
 
ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తేలడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ డ్రామాలకు తెరదీశాడని దుయ్యబట్టారు. సర్కార్ దగ్గర నయాపైసా లేదని, జీతాలు కూడా సరిగా ఇవ్వలేని కేసీఆర్ ఎన్నికల తాయిలాల కోసం విలువైన ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతున్నారని మండిపడ్డారు.  తెలంగాణాలో బీజేపీ గ్రాఫ్ తగ్గిందని, పార్టీలో గ్రూపు తగాదాలున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారమేనని కొట్టిపారేసారు.
పార్టీ గ్రాఫ్ తగ్గించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ప్రచారం విజయవంతం కావొచ్చేమో తప్ప ప్రజలు మాత్రం బీజేపీ పక్షానే ఉన్నారని చెప్పారు.
కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్మని వెల్లడించారు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలుంటే దానిని భూతద్దంలో చూపడం మూర్ఖత్వమే అవుతుందని హెచ్చరించారు. 
 
వర్షాలతో పంట నష్టపోయి, గూడు కోల్పోయి ప్రజలు, రైతులు విలవిల్లాడుతుంటే కనీసం పరామర్శించని కేసీఆర్ విమానంలో మహారాష్ట్రకు పోయి ఎట్లా రాజకీయాలు చేస్తున్నరో అందరూ గమనిస్తున్నరని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి పర్యటిస్తే సీఎంను గల్లా పట్టి నిలదీస్తారని, వరద సాయం ఏమైందని తిడతారనే భయంతోనే కేసీఆర్ పరామర్శకు వెళ్లడం లేదని విమర్శించారు.

 
బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో ఉన్న బీజేపీ జాతీయ కార్యాలయంలో 2వ అంతస్తులో ఆయనకు కేటాయించిన గదిలోకి వేదమంత్రాల నడుమ ప్రవేశించారు. అనంతరం పూజాది కార్యక్రమాలు చేసి తన సీటులో ఆసీనులయ్యారు. అనంతరం నేరుగా విమానాశ్రయానికి బయల్దేరి హైదరాబాద్ పయనమయ్యారు.

బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడిన బండి సంజయ్  తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు జాతీయ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

రానున్న రోజుల్లో తనకు ఏ పని అప్పగించినా సరే బాధ్యతాయుతంగా పనిచేస్తానని చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోదీ నేతృత్వంలో రామరాజ్యాన్ని స్థాపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టడానికి ముందు గురువారం రాత్రి బండి సంజయ్ కుటుంబ సమేతంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.