త్వరలో టీటీడీ వెబ్‌సైట్‌లో రీఫండ్ ట్రాకర్

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్‌ ద్వారా పంపుతున్నామని, త్వరలో రీఫండ్‌ను ట్రాక్‌ చేసేందుకు టీటీడీ వెబ్‌సెట్‌లో ట్రాక్‌ర్‌ను పొందుపరుస్తామని టీటీడీ ఈవో  ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.  తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో  మాట్లాడుతూ స్పీడ్ పోస్టు చేసిన‌పుడు ఏవిధంగా క‌వ‌ర్‌ను ట్రాక్ చేయ‌వ‌చ్చో అదే త‌ర‌హాలో రీఫండ్ సొమ్ము స‌మాచారాన్ని తెలుసుకోవ‌చ్చ‌ని చెప్పారు.
తిరుమలలో యుపిఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన వెంటనే కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ చేయడం జరుగుతోంద‌ని చెప్పారు.  క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 5 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం జమ చేస్త‌న్నామ‌ని తెలిపారు.
ఈ సమాచారం ధ్రువీకరించుకోకుండా కొందరు భక్తులు కాల్‌ సెంటర్లకు ఫోన్లు చేసి, అధికారులకు మెయిళ్లు పంపుతున్నార‌ని, భక్తులు తమ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించుకుని కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ కాకపోతేనే సంప్రదించాలని కోరారు. రీఫండ్‌ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తప్పుగా సరిచూసుకుంటున్నార‌ని, ఎస్ఎంఎస్‌లో సూచించిన విధంగా 3 నుండి 5 రోజులు వేచి ఉండడం లేదని వివ‌రించారు. మ‌రికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని, వెరిఫికేషన్‌ కోడ్‌ సబ్‌మిట్‌ చేయకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్‌ జనరేట్‌ కావడం లేదని చెప్పారు.

శ్రీవారి పవిత్రోత్సవాలు

ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962 నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
భక్తులకు ‘‘పే లింక్‌’’ ఎస్ఎంఎస్‌
 సిఆర్ఓలో లక్కీడిప్‌ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు జూలై 19వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా ఎస్ఎంఎస్‌ ద్వారా పేలింక్‌ పంపుతున్నారు. భక్తులు తిరిగి కౌంటరు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యుపిఐ లేదా క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు ద్వారా ఆన్లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్‌ తీసుకోవచ్చు.
త్వరలో ఎంబీసీ-34 కౌంటర్‌ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్‌ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలు చేయనున్నారు.