పంచాయతీ నిధుల `దొంగతనం’పై సీబీఐ దర్యాప్తు

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాల ద్వారా పంపిన గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించడంపై సీబీఐ దర్యాప్తు జరిపించి తమ నిధులు తమకు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్  పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి. బి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావుల నేతృత్వంలో కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌, కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తదితరులను కలిసి గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని, ఈ విషయంపై విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల గ్రామపంచాయతీలకు ఆర్థిక సంఘాల ద్వారా నిధులు పంపిస్తుందని, వాటిని దారి మళ్ళించడం రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి  ఇంతమంది సర్పంచులు వచ్చి  ఈ సమస్యను తన  దృష్టికి తీసుకువచ్చారు కనుక  తప్పకుండా వారి సమస్యలపై ఒక కమిటీ వేసి ఉన్నత స్థాయి విచారణ జరిపించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రులను కలిసిన వారిలో పార్లమెంట్ సభ్యులు కనకమేడల రవీంద్రనాథ్  కింజరపు రామ్మోహన్ నాయుడు, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్  లతో పాటు  టిడిపి, వైసిపి, జనసేన, బీజేపీ, సిపిఐ,  ఇతర పార్టీలకు చెందిన 100 మంది సర్పంచులు ఉన్నారు.

పంచాయితీ నిధులను దారి మళ్లించడంతో మొత్తం పంచాయితీరాజ్ వ్యవస్థ నిర్వీర్యంగా మారుతోందని  రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక చిన్న పని చేయడానికి కూడా సర్పంచుల దగ్గర నిధులు లేవని, మరోవైపు సమాంతరంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను గ్రామ వాలంటీర్లు, గృహ సారథుల పేరుతో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసి తమ హక్కులు, అధికారాలను హైజాక్ చేసిందని మండిపడ్డారు.

మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఆలోచనలకు తూట్లు పొడుస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందని  ఆరోపించారు.ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేటాయించిన పంచాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని దుయ్యబట్టారు. పంచాయితీ నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. 

అందుకే తాము ఢిల్లీ పర్యటన చేపట్టి కేంద్ర మంత్రులు మొరేశ్వర్ పాటిల్,  నిర్మల సీతారామన్‌లను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. తాము రాజకీయాలకు అతీతంగా పంచాయితీరాజ్ వ్యవస్థ బాగు కోసం ఈ పోరాటం చేస్తున్నామని, హోంమంత్రి అమిత్ షా ను కూడా కలిసి తమ ఇబ్బందులు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు.