రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మోడీ ఇంటి పేరు కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. అలాగే వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ పోటీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు వీలు కల్పించింది.
 
శిక్షపై స్టే కోరుతూ రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్‌, పీఎస్‌ నరసింహ, సంజయ్‌ కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రాహుల్‌ను దోషిగా నిర్ధారించడం విస్తృతమైందని, ఇది ఒక వ్యక్తిపైనే కాకుండా ఎన్నుకున్న ఓటర్ల హక్కుపై కూడా ప్రభావం చూపుతుందని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ పేర్కొన్నారు. ఆయనకు విధించిన జైలు శిక్షపై స్టే విధించడంతోపాటు ఎంపీ అనర్హతను ఎత్తివేసింది.
 
ఈ సందర్భంగా గుజరాత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్‌ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దిగువ కోర్టులు పత్రాల సంఖ్య చూశాయేగానీ సరైన కారణాలు చూపలేదని వ్యాఖ్యానించింది.  అలాగే మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌ గాంధీకి కూడా చురకలు వేసింది.
 
కనీసం 1 సంవత్సరం 11 నెలల శిక్ష విధించినా, రాహుల్ పై లోక్ సభ అనర్హత వేటు తప్పేదని వ్యాఖ్యనించింది. రాహుల్ పై అనర్హత వేటు వల్ల, అతడితో పాటు ఆయన నియోజకవర్గంలోని ప్రజలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది.  కాగా, తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు నిర్ద్వంద్వంగా నిరాకరించారు.
క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందుకు తనపై ప్రధాని మోదీ పలు అవమాన కర వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లోనూ రాహుల్ గాంధీ ప్రస్తవించారు.  ‘‘మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలేనా’’ అంటూ కర్ణాటకలో 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక సభలో  రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో, ప్రధాని మోదీ ఇంటి పేరుపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై గుజరాత్ లోని సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. 
 
ఆ కేసును విచారించిన కోర్టు రాహుల్ గాంధీకి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో, రాహుల్ గాంధీ తన లోక్ సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. ఆ తీర్పుపై స్టే ఇవ్వడానికి గుజరాత్ హైకోర్టు కూడా నిరాకరించింది. దాంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  సుప్రీంకోర్టులో శుక్రవారం రాహుల్ గాంధీ వేసిన స్టే పిటిషన్ పై వాదనలు కొనసాగాయి.
రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రధాని మోదీ సహా ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదని తెలిపారు.  ఇప్పటివరకు ఏ పరువు నష్టం కేసులోనూ రెండేళ్ల జైలు శిక్ష విధించలేదని కోర్టుకు గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గొంతు నొక్కే ప్రయత్నాల్లో భాగమే ఈ తీర్పు అని, ఈ తీర్పు వల్ల ఆయన రెండు సెషన్స్ పార్లమెంటుకు హాజరు కాలేకపోయారని వివరించారు.
ఫిర్యాదు దారు అయిన గుజరాత్ బీజేపీ నేత పూర్ణేశ్ మోదీ తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ వాదనలు వినిపించారు. రాహుల్ తన ప్రసంగంలో మోదీ పేరును ప్రస్తావించారనడానికి ఆధారాలున్నాయని ఆయన వాదించారు. వాదనల అనంతరం గుజరాత్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.