ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి కల్పించాలని కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఢిల్లీ ఆర్డినెన్స్’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుని మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రవేశపెట్టగా, గురువారం దీనికి ఆమోదం తెలుపుతూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.  ఈ బిల్లుకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన తెలపడం, సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో బుధవారం సభ వాయిదా పడింది. గురువారం కూడా ఈ బిల్లుపై వాడీవేడీగా చర్చ సాగింది.
దీనికి ఆమోదం తెలపకూడదని ప్రతిపక్షాలు గట్టిగానే డిమాండ్ చేశాయి. ఇలా ప్రతిపక్షాల ఆందోళన మధ్యే స్పీకర్ ఈ బిల్లుకి ఆమోదం తెలిపారు. బిల్లుపై నాలుగుగంటల పాటు చర్చ జరిగింది. ప్రతిపక్షం, అధికారపక్షం నడుమ తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. చర్చకు ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు ఇచ్చారు.
 
దీంతో ప్రతిపక్షాలు వెంటనే సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ రింక్ అయితే లోక్‌సభలో బిల్ పేపర్లను చింపేసి, వెల్‌లోకి విసిరేశారు. దీంతో ఆగ్రహానికి గురైన స్పీకర్ ఆయనను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాల పూర్తయ్యేంత వరకు సభ కార్యక్రమాలకు హాజరు కాకుండా సస్పెన్షన్ విధించారు. 
ప్రతిపక్ష కూటమి ఇండియాపై నిప్పులు చెరుగుతూ వాడివేడిగా మండిపడ్డారు. ఇటువంటి బిల్లును తీసుకువచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం, ఢిల్లీ పరిధిలో తగు చట్టాలను తీసుకువచ్చే పూర్తి స్థాయి సంపూర్ణ హక్కు కేంద్రానికి ఉందని, తగు విధంగా తాము నిబంధనలను కూడా రూపొందించవచ్చునని తెలిపారు.
మరోవైపు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే, దేశ రాజధానిలో బ్యూరోక్రాట్లను ఎవరు నియంత్రిస్తారనే దానిపై బిల్లును తీసుకొచ్చామని అమిత్‌షా పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఏదైనా సమస్యపై చట్టాలు చేసే హక్కు ఉందని సుప్రీంకోర్టు ఆదేశాలు చెబుతున్నాయని చెప్పారు. ఢిల్లీ కోసం చట్టాలు చేసేందుకు కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.
 
లోక్‌సభలో జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తూ.. ‘ఢిల్లీ పరిధిలో అధికారులపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదే. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. 1993 నుంచి 2015 వరకూ ఏ ముఖ్యమంత్రి పోరుబాట పట్టలేదు. ప్రజలకు సేవ చేయడానికే ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని, అందువల్లే ఎటువంటి పోరాటాలు జరుగలేదు. ప్రజలకు సేవ చేయాలంటే పోరాడాల్సిన అవసరం లేదు. కానీ, వారికి అధికారం కావాలంటే మాత్రం వారు పోరాడొచ్చు’ అని వ్యాఖ్యానించారు.
 
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రూపు-ఏ ఆఫీసర్ల బదిలీలు, నియామకాల అధికారంపై కేంద్ర ప్రభుత్వం గత మే 19న ఆర్డినెన్స్ జారీ చేసింది. శాంతిభద్రతలు, పోలీసుల, భూ వ్యవహరాలు మినహా అన్ని అంశాల్లో తుది అధికారం ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్.. దాని స్థానే బిల్లు తీసుకొచ్చింది.