చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ఆర్బిటర్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3కి సంబంధించి కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. భూకక్ష్యను దాటుకుంది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావంలోకి పంపించడానికి చంద్రాయన్ 3 కక్ష్యను మరింత పెంచింది ఇస్రో. 

శనివారం సాయంత్రం సరిగ్గా 6:59 నిమిషాలకు చంద్రుడి ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. ఇప్పటి నుంచి చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. చంద్రుడి కక్ష్యలోకి వెళ్లేలా లూనార్ ఆర్బిట్ ఇన‌సర్షన్ ప్రక్రియను ఇస్రో చేపట్టింది. దీని అనంతరం మరో 18 రోజులు చంద్రుడి కక్ష్యలోనే చంద్రయాన్-3 ఆర్బిటర్ తిరగనుంది. ఇస్రో చేపట్టే ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో యావత్ దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రయాన్-3 మిషన్ లో అత్యంత కీలకమైన ఘట్టం శనివారం చోటుచేసుకుంది. ఇస్రో చంద్రయాన్-3 ఆర్బిటర్ చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. భూ కక్ష్యలను పూర్తి చేసుకున్న చంద్రయాన్-3 శనివారం రాత్రి 7 గంటలకు జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.  అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించిన ఇస్రో కచ్చితమైన ప్రణాళికతో ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి చంద్రయాన్-3ను విజయవంతంగా ప్రవేశపెట్టింది.

18 రోజుల పాటు చంద్రుడి చుట్టూ తిరగనున్న చంద్రయాన్-3 జాబిల్లిపై దిగనుంది. అనంతరం రోవర్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యి పరిశోధనలు చేయనుంది. కిందటి నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ 3 నింగి వైపు దూసుకెళ్లిందిన విషయం తెలిసిందే. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో.

ఈ నెల 23వ తేదీన సరిగ్గా సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రయాన్ 3.. జాబిల్లి మీద కాలు మోపుతుంది. ల్యాండింగ్ కోసం చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకుంది ఇస్రో. నింగిలోకి దూసుకెళ్లిన ఈ స్పేస్ క్రాఫ్ట్ 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణం సాగించాల్సి ఉంది. ఇందులో భాగంగా అయిదు దశల్లో భూకక్ష్యను అధిగమించింది.
22 రోజుల వ్యవధిలో భూకక్ష్యను దాటుకుంది. ఇప్పటివరకు 2,60,369 కిలోమీటర్ల మేర ఈ రాకెట్ అంతరిక్ష ప్రయాణాన్ని సాగించింది. చంద్రుడిని చేరుకోవడానికి ఇంకో లక్షా 24 వేల కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించాల్సి ఉంది. ఈ నెల 23వ తేదీన సాయంత్రానికి చంద్రుడి ఉపరితలానికి సమీపిస్తుంది. ఆ సమయంలో క్రాష్ ల్యాండింగ్ కాకుండా ఇస్రో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. 
 
చంద్రయాన్ 3 ఇప్పుడున్న వేగంతోనే ప్రయాణిస్తే.. క్రాష్ ల్యాండింగ్ తప్పదు. అందుకే- దాని వేగాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. జాబిల్లి ఉపరితలం మీద సవ్యంగా దిగాలంటే.. చంద్రయాన్ 3 వేగాన్ని జీరో కిలోమీటర్లకు తీసుకుని రావాల్సి ఉంటుంది. అదే ఈ ప్రక్రియ మొత్తానికీ అత్యంత కీలక ఘట్టం.

 
ఎందుకంటే- 2019లో ప్రయోగించిన చంద్రాయన్ 2 క్రాష్ ల్యాండింగ్‌కు గురైన విషయం తెలిసిందే. చంద్రుడిపై ల్యాండింగ్ చేసే సమయంలో దాని వేగాన్ని నియంత్రించడంలో ఇస్రో విఫలమైంది. ఫలితంగా వేల కిలోమీటర్ల వేగంతో నేరుగా చందమామ ఉపరితలాన్ని ఢీకొట్టింది. ముక్కలైపోయింది. ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.