ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చిన పెద్ద మార్పు జనం తమ అభిమతం ప్రకారం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం పేర్కొన్నారు. ఆర్టికల్ రద్దు చేసి శనివారం నాటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చిన మార్పులు వివరించారు. ఆర్టికల్ రద్దు కాకమునుపు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల, వేర్పాటు వాదుల బెదిరింపులు, దాంతో స్కూళ్లు, కాలేజీలు, వ్యాపారాలు, సంవత్సరానికి 150 రోజుల పాటు మూతపడడం వంటివి సాధారణంగా జరిగేవని, అవన్నీ ముగిసిపోయాయని సిన్హా విలేఖరులకు చెప్పారు.
కశ్మీర్ యువత కలలకు ఇప్పుడు రెక్కలు వచ్చాయని, రానున్న రోజుల్లో జాతిపునర్నిర్మాణంలో వారి సేవలు ఎవరికీ తీసిపోవని జోస్యం చెప్పారు. జమ్ముకశ్మీర్ త్వరలో తన వైభవాన్ని పొందగలుగుతుందని భరోసా ఇచ్చారు. అంతకు ముందు ఆయన దాల్ లేక్ ఒడ్డున కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గత నాలుగేళ్లలో జమ్ముకశ్మీర్‌లో యువశక్తి, మహిళా శక్తి, రైతుల వల్ల అనేక మార్పులు వచ్చాయని వివరించారు.
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ- కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత (జమ్మూ-కశ్మీర్, లడఖ్) ప్రాంతాలుగా ప్రకటించింది. 2019 ఆగస్టు 5న ఈ అధికరణను రద్దు చేయగా, శనివారం నాటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే తనతో పాటు పలువురు నేతలను గృహనిర్బంధంలో ఉంచారని మాజీ సిఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లు పూర్తయిన వేళ, స్థానికంగా భారీ బందోబస్తు చేపట్టారు. ఈ క్రమం లోనే శనివారానికి జమ్ము బేస్ క్యాంప్ నుంచి అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. ఇక్కడి నుంచి ఎవరినీ యాత్రకు అనుమతించలేదు. దీంతో వందలాది యాత్రికులు క్యాంపులకే పరిమితమయ్యారు.
మరోవైపు ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానంలో ఇటీవలే వాదనలు మొదలయ్యాయి. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఒడిశా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అమిత్‌షా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా దేశ ప్రజల తరుఫున తాను ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
చైనా జలవిద్యుత్ డ్యామ్ లతో 12 లక్షల మంది టిబెటన్ల నిరాశ్రయం