మణిపూర్‌లో ముగ్గురిని కాల్చిచంపిన తీవ్రవాదులు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింసాగ్ని చల్లారడం లేదు. దాదాపు గత మూడు నెలలుగా మణిపూర్ మండిపోతూనే ఉంది. తాజాగా, శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక గ్రామంలోకి చొరబడిన దుండగులు ముగ్గురిపై కాల్పులు జరిపి చంపేశారు. బిష్ణుపుర్ జిల్లాలోని క్వాట్క గ్రామంలో ఈ ఘటన జరిగింది. 
 
ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు.  అర్ధరాత్రి దాటిన తర్వాత తుపాకులు, కత్తులు తదితర ఆయుధాలతో ఊరిలోకి చొరబడిన దుండగులు ఒక ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురిని కాల్చి చంపడమే కాకుండా, ఆ తర్వాత వారి మృతదేహాలను ముక్కలుగా నరికి, అక్కడి నుంచి పారిపోయారు. 
 
మృతి చెందిన వారు యుమ్నం జితిన్ మైతేయి, యుమ్నం పిశాక్ మైతేయి, అతడి కుమారుడు ప్రేమ్ కుమార్ మైతేయి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం కుకీల ఆధిక్యత ఉన్న పర్వత ప్రాంతాలకు, మైతేయిలు అధికంగా ఉండే లోయ ప్రాంతానికి మధ్య బఫర్ జోన్ లో ఉంటుంది. ఇక్కడ మోహరించిన కేంద్ర బలగాలను కూడా తప్పించుకుని దుండగులు గ్రామంలోకి చొరబడ్డారు.

గత మూడు, నాలుగు వారాలుగా ఈ క్వట్క ప్రాంతం ఉద్రిక్తంగా ఉంది. గిరిజన, గిరిజనేతరుల మధ్య ఇక్కడ పలుమార్లు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. దాంతో, ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా పోలీసులు, పారా మిలటరీ దళాలను మోహరించింది. తాజా ఘటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత మరింత తీవ్రమైంది. 

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశామని బీజేపీ ఎమ్మెల్యే ఆర్ కే ఇమావ్ తెలిపారు. పారా మిలటరీ దళాలు, పోలీసులు విధుల్లో ఉండగానే, వేరే జిల్లా నుంచి సాయుధులు గ్రామంలోకి చొరబడగలగడం సాయుధ దళాల వైఫల్యమేనని, వారిపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరామని పేర్కొన్నారు. ఆ పారా మిలటరీ దళాలు, పోలీసుల్లో కొందరు ఆ దుండగులకు సహకరించారని ఆరోపించారు.

మరణించిన ముగ్గురు వ్యక్తులు సహాయ శిబిరాలలో ఉండేవారని, పరిస్థితి మెరుగుపడడంతో శుక్రవారం మధ్యాహ్నమే వారు తమ స్వగ్రామం క్వాక్తా తిరిగివచ్చారని పోలీసులు వివరించారు. ఈ సంఘటన దరిమిలా క్వాక్తాలో గుమికూడిన గ్రామస్తులు చురచంద్‌పూర్ వెళ్లేందుకు బయల్దేరారని, వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పోలీసులు చెప్పారు.

ఇలా ఉండగా క్వాక్తా సమీపంలో శనివారం ఉదయం భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల పోరులో ఒక పోలీసుతోసహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఇంఫాల్‌లోని మెడిసిటీకి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా..తాజా ఘర్షణలను పురస్కరించుకుని కర్ఫూ సడలింపు వేళలను జిల్లా యంత్రాంగం కుదించింది. రెండు ఇంఫాల్ జిల్లాలలో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు కర్ఫూ సడలించగా ఇప్పడు దాన్ని ఉదయం 5 నుంచి ఉదయం 10.30 వరకు కుదించినట్లు అధికారులు చెప్పారు.