ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘తోషాఖానా’  కేసులో ఇమ్రాన్ ఖాన్ కు స్థానిక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, ఐదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిషేధం విధించింది. ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టుకు చెందిన అదనపు న్యాయమూర్తి హుయున్ దిలావర్ శనివారం తీర్పు వెల్లదించారు.
ఇమ్రాన్ ఖాన్ రూ. 1 లక్ష జరిమానా కూడా విధిస్తూ దాన్ని చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష ఉంటుందని న్యాయమూర్తి ప్రకటించారు. ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన ఖరీదైన బహుమతులను అక్రమంగా అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ పై నమోదైన కేసు కు సంబంధించి ఈ తీర్పును కోర్టు వెలువరించింది. ఈ కేసునే తోషాఖానా అవినీతి కేసుగా వ్యవహరిస్తారు.

తోషిఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ఇసిపి) గత ఏడాది నమోదు చేసిన ఫిర్యాదు కేసులో ఇమ్రాన్ ఖాన్ (70)కు న్యాయమూర్తి శనివారం తీర్పు వెలువరించారు. ఇదే కేసులో ఇమ్రాన్ ఖాన్‌పైఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసింది. 2018 నుంచి 2022 మధ్య పాక్ ప్రధానిగా ఉన్నకాలంలో విదేశీ పర్యటనలలో తనకు లభించిన రూ. 14 కోట్లకు పైగా విలువైన బహుమతపులను అమ్మినట్లు ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు నమోదయ్యాయి. 

ఇతర దేశాలకు చెందిన ప్రభుత్వాలు తమ దేశ ప్రధాన మంత్రి, ఇతర ప్రభుత్వాధినేతలకు అందచేసే బహుమతులను భద్రపరిచే శాఖ తోషఖానాగా పాక్‌లో వ్యవహరిస్తారు.  ఆ బహుమతులు ప్రభుత్వానికి చెందుతాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ తనకు అందిన బహుమతులను అమ్ముకున్నట్లు ఆయనపై అరోపణలు వచ్చాయి.

ఎన్నిక‌ల సంఘానికి ఇమ్రాన్ కావాల‌నే త‌ప్పుడు వివ‌రాల‌ను వెల్ల‌డించిన‌ట్లు కోర్టు తెలిపింది. ఎల‌క్ష‌న్ చ‌ట్టంలోని 174వ సెక్ష‌న్ ప్ర‌కారం కోర్టు ఆయ‌న‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల అమలు కోసం కాపీ ఆర్డ‌ర్‌ను ఇస్లామాబాద్ పోలీసు చీఫ్‌కు పంపించాల‌ని జ‌డ్జి దిలావ‌ర్ తెలిపారు. న్యాయమూర్తి వెంటనే ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు.

పాకిస్తాన్ లోని విచారణ కోర్టు ఈ తీర్పు వెలువరించే సమయంలో ఇమ్రాన్ ఖాన్ కోర్టు హాల్లో లేరు. తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు ఇమ్రాన్ ఖాన్ ను అతడి నివాసం నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. కోట్ ల‌క్‌ప‌త్ జైలుకు ఆయ‌న్ను త‌ర‌లిస్తున్న‌ట్లు పంజాబ్ పోలీసులు వెల్ల‌డించారు.ఈ తీర్పు నేపథ్యంల ఇమ్రాన్ ఖాన్ ఈ నవంబర్ లోపు జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాకపోవచ్చని పాకిస్తాన్ రాజకీయ వ్యవహారాల నిపుణులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు.