జగన్‌పై కోడికత్తి కేసు విశాఖకు బదిలీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిపై 2019 ఎన్నికల ముందు జరిగిన కోడికత్తి దాడి కేసు విశాఖకు బదిలీ అయ్యింది . ఇప్పటి వరకు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో సాగిన విచారణలు ఇకపై విశాఖ ఎన్‌ఐఏ  కోర్టులో జరుగుతుందని మంగళవారం విజయవాడలో జరిగిన కోర్టు విచారణలో న్యాయమూర్తి వెల్లడించారు. 
2018 అక్టోబర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌ పై శ్రీనివాస్‌ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశారు.
దాడికి పాల్పడ్డ నిందితుడిని అదే సమయంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ నడుస్తుంది.
అయితే నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరుఫున వాదిస్తున్న న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం కేసు విచారణలోకి వచ్చింది.
దీంతో పాటు ఈ కేసుపై సీఎం జగన్‌ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. 
ఇదిలాఉండగా విజయవాడలో ఉన్న ఎన్‌ఐఏ కోర్టు విశాఖకు బదిలీ చేస్తున్నందున ఇకపై విశాఖలో కేసు విచారణ కొనసాగుతుందని జడ్జి వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ కేసు విచారణ ఆగస్టు 8న నిర్వహించాలని ఆయన ఆదేశించారు. 
 
అయితే, ఇప్పటికే 80 శాతం విచారణ పూర్తయిన తర్వాత ఇప్పుడు విశాఖకు మార్చడంతో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉందని నిందితుని తరపున న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు.  ఇప్పటి వరకు కీలక సాక్షి అయిన సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వక పోవడంతో విచారణలో జాప్యం జరుగుతుంది. 
 
అయితే భద్రత దృష్ట్యా కోర్టుకు రాలేనని, కోర్టు నియమించిన న్యాయవాది ద్వారా గాని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని తన వాంగ్మూలం నమోదు చేయాలని జగన్ కోరుతున్నారు. కానీ, శిక్షాస్మృతి ప్రకారం స్వయంగా కోర్టుకు వచ్చి, నిందితుడి ముందు వాంగ్మూలం ఇవ్వాల్సిందే అని నిందితుని తరపున న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు.
 
ఇప్పటి వరకు ఏపీ మొత్తానికి ఎన్ఐఎ కేసుల విచారణకు విజయవాడలో ఒకే కోర్టు ఉండడంతో  అందరికి ఇబ్బందికరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం విశాఖపట్టణంలో మరో ఎన్ఐఎ కోర్టును తాజాగా ఏర్పాటు చేసింది. ఆ కోర్టుకు పశ్చిమ గోదావరి నుండి శ్రీకాకుళం వరకు ఉమ్మడి జిల్లాల కేసులు కేటాయించింది. దానితో విజయవాడ కోర్టులోని ఈ కేసును విశాఖపట్నంకు మార్చడం జరిగింది.