హథీరాంజీ మఠం మహంతుపై చర్య

తిరుపతి హథీరాంజీ మఠానికి గతంలో మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి పలు అక్రమాలకు పాల్పడినట్లు  త్రి సభ్య కమిటీ పలు ఆధారాలతో ధృవీకరించిన నేపధ్యంలో ఆ మహంతుపై తదుపరి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ధార్మిక పరిషత్ నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

తిరుపతి హథీరాం జీ మఠానికి  గతంలో మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడినట్లు, మఠం ఆస్తుల్ని లీజులకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు, కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పారు. అయితే ఈ ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి హథీరాంజీ మఠంపై ఎలాంటి హక్కులు లేవని అర్జున్ దాస్ గతంలో కోర్టుకెళ్లారని పేర్కొన్నారు.

 రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర ధార్మిక పరిషత్ ద్వారానే ఆ మహంతుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం  ఉపక్రమించిందని తెలిపారు.  రాష్ట్ర ధార్మిక పరిషత్ ద్వారా హథీరాంజీ మఠం మహంత్ గా ఉన్న అర్జున్ దాస్ ను సస్పెండ్  చేసి, ఆ మఠానికి ఒక ఫిట్ పర్సన్ని నియమించడం జరిగిందని చెప్పారు. 

అయితే అర్జున్ దాస్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి 16 ఆరోపణలను ధృవీకరిస్తూ   ఆధారాలతో నివేదికను అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సమగ్ర నివేదికను రాష్ట్ర ధార్మిక పరిషత్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తదుపరి   అర్జున్ దాస్ పై చర్యలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు వివరించారు. 

కాగా, సనాతన హిందూ  ధర్మం ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ధర్మ ప్రచార పరిషత్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.  ఈ ధర్మ ప్రచార పరిషత్ ఈ నెల 6 న అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం నుండి  సనాతన హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు.