మైతేయీ, కుకీల మధ్య సామరస్యంకు గవర్నర్ చొరవ

మైతేయీ, కుకీ వర్గాల మధ్య నెలకొన్న ద్వేషం, అపనమ్మకాల్ని అంతం చేయడానికి తాను కృషి చేస్తున్నానని మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే పేర్కొన్నారు. శనివారం చురచంద్‌పూర్ జిల్లాలోని ఒక సహాయ శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైతేయీ, కుకీ వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థల్ని కలుస్తున్నానని తెలిపారు. 
 
రాష్ట్రంలో శాంతి, పరిస్థితుల్ని సాధారణ స్థితిని తీసుకొచ్చేందుకు వారి సహకారం కోరుతున్నానని తెలిపారు. తాను రెండోసారి సహాయ శిబిరానికి వచ్చానని చెబుతూ దాదాపు మూడు నెలలు ఈ ప్రజలు తమ ఇళ్లకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది ప్రజలు తమ ఇళ్లతో పాటు అన్ని కోల్పోయారని, వారికి ఏమీ మిగల్లేదని విచారం వ్యక్తం చేశారు. 
 
కనీసం సహాయ శిబిరాల్లోనైనా వీరికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా తాను ఇక్కడికి వచ్చినట్టు ఆమె స్పష్టం చేశారు. బట్టల దగ్గర నుంచి దోమల నివారణ మందుల వరకు.. కనీస సౌకర్యాలను సహాయ శిబిరాల్లో ఉన్న ప్రజలకు అందించాలని తాను ప్రభుత్వాన్ని ఆదేశించానని గవర్నర్ అనసూయ చెప్పారు. 
 
ఇక్కడ మందుల సమస్య ఉందని కూడా తెలుసుకున్నానని, ట్రక్కులు ఇక్కడికి రాకపోవడంతో వారికి చాలా వస్తువులు అందడం లేదని చెప్పారు. అయినప్పటికీ అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని, మిజోరాం కూడా తన వంతు సహాయం అందిస్తుందని చెప్పారు. జాతి కలహాలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రజలు, ముఖ్యంగా నాయకులు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని  గవర్నర్ పిలుపునిచ్చారు.
 
సీబీఐ దర్యాప్తు ప్రారంభం

మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనకు సంబంధించి వైరల్‌ అయిన వీడియో కేసుపై దర్యాప్తును సీబీఐ శనివారం ప్రారంభించింది. కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ ఆదేశాలకు లోబడి ఐపీసీ సెక్షన్లు 153ఏ, 398, 427, 436, 448, 302, 354, 364, 326, 376, 34 మరియు 25(1-సి) ఏ యాక్టు కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి.

కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేసారు. వీడియో తీసిన మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కస్టడీలో తీసుకొని విచారిస్తామని, బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేస్తామని, నేరం జరిగిన స్థలాన్ని పరిశీలిస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి.

ఘర్షణల వెనుక చైనా పాత్ర?

ఇలా ఉండగా, మణిపూర్ ఘర్షణలు, విధ్వంసకాండ వెనుక విదేశీ పాత్ర , ప్రత్యేకించి చైనా సాయం ఉండటానికి వీలుందని భారత సైనిక మాజీ ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరావానే తెలిపారు. మణిపూర్‌లో ఇప్పుడు కనివినిఎరుగని రీతిలో సాగుతోన్న హింసాకాండ అసాధారణంగా ఉందని ఈ సైనికాధికారి అభిప్రాయపడ్డారు. హింసకు చైనా నుంచి నేరుగా సాయం ఉండకపోవచ్చు కానీ అక్కడి వివిధ తిరుగుబాటు బృందాలకు పలు స్థాయిల్లో చైనా సాయం ఉండి ఉంటుందని ఆయన చైనా పాత్ర గురించి సంకేతాలు వెలువరించారు.
 
ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో శనివారం జాతీయ భద్రతా అంశాలపై జరిగిన చర్చాగోష్టిలో నరావానే మాట్లాడుతూ కేవలం పొరుగుదేశంలోనే కాకుండా, మన సరిహద్దుల్లోని రాష్ట్రంలో అయినా అంతర్గత భద్రత కీలకం అని, దీనిపై రాజీ పడటానికి వీల్లేదని తెలిపారు. ఎక్కడ ఎటువంటి అభద్రత ఉన్నా అది ఖచ్చితంగా దేశ మొత్తం మీది జాతీయ భద్రతకు విఘాతం అవుతుందన్నారు. కల్లోలిత మణిపూర్‌లో శాంతిభద్రతల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం తగు విధంగా చర్యలు తీసుకుంటుందనే తాము ఆశిస్తున్నట్లు విశ్రాంత సైనికాధికారి తలిపారు.