ఆవిష్కరణలకు ప్రయోగశాలగా నూతన విద్యా విధానం

భారత్ ఆవిష్కరణలకు ప్రయోగశాలగా మారిందని ప్రపంచ దేశాలు గుర్తించాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఇపి) ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రగతి మైదాన్‌లో శనివారం అఖిల భారతీయ శిక్షా సమాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

యువత ప్రతిభను కాకుండా వారి భాషను బట్టి అంచనా వేయడం సరికాదని ప్రధాని హితవు చెప్పారు. భారత్‌లో తమ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని ఆయన తెలిపారు. తమ దేశాల్లో కూడా ఐఐటీ క్యాంపస్‌లను ప్రారంబించమని కోరుతున్నట్టు పేర్కొన్నారు. 

ఐఐటీ క్యాంపస్‌లను అబుదాబి, టాంజానియాలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని చెప్పారు. భారత్‌ను పరిశోధన ఆవిష్కరణలకు హబ్‌గా మార్చడమే జాతీయ విద్యావిధాన లక్షమని తెలిపారు. మన విద్యావిధానం సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థకు, భవిష్యత్తు సాంకేతికతకు సమాన ప్రాముఖ్యతను ఇచ్చిందని పేర్కొన్నారు. 

పాఠశాలల్లో విద్యార్థులకు విపత్తు, ప్రతిస్పందన, వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీలపై అవగాహన కల్పించాలని మోదీ కోరారు. ఈసందర్భంగా 12 భాషల్లోకి అనువదించిన పాఠ్యాంశ పుస్తకాలతోపాటు పీఎంశ్రీ తొలివిడత నిధులను విడుదల చేశారు. సమగ్ర, వినూత్న బోధన విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం, అన్ని స్థాయిల్లోని విద్యార్థులకు సమాన, నాణ్యమైన విద్య అందిస్తూ వారిలో సంపూర్ణ పరివర్తన తీసుకురావాలన్న లక్షంతో పీఎంశ్రీ పాఠశాలల ఏర్పాటుకు గతేడాది కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

రెండు రోజుల పాటు జరిగిన ఎన్‌ఈపీ 2020 కార్యక్రమంలో దేశంలోని పలువురు విద్యావేత్తలు, విద్యా రంగ నిపుణులు, పరిశ్రమలు-విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్ లక్ష్యాలు, విద్యార్థులకు మెరుగైన విద్య, సౌకర్యాలను అందించడంపై చర్చించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఏఐసీటీఈ ఛైర్మన్, ఏఐసీటీఈ చీఫ్ కోఆర్డినేటర్ బుద్దా చంద్రశేఖర్ ఇన్సోల్ పోర్టల్ సీఈఐ కిరణ్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఏడాది క్రితమే ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో సేవలందించబోతున్నట్టు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, డాటా స్టోరేజీ, నైపుణ్యాభివృద్ధి, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్‌కు ఇన్సోల్ పోర్టల్ బాగా ఉపయోగపడుతుందన్నారు. దీనిని విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులు, ఉపాధి సంస్థలు చక్కగా ఉపయోగించుకోవచ్చని ఆయన చెప్పారు. కేవలం రూ. 1200లకే ప్రొఫెషనల్ కోర్సులు, ఫారిన్ లాంగ్వేజెస్, పోటీ పరీక్షల మెటీరియల్‌నూ ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చని కిరణ్ వివరించారు.