సీజేఐపై రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసిన రచయిత అరెస్టు

త‌మిళ‌నాడుకు చెందిన రాజ‌కీయ విశ్లేష‌కుడు, ప్రచురణకర్త భ‌ద్రి శేషాద్రని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మ‌ణిపూర్ హింస‌తో పాటు సీజేఐ చంద్ర‌చూడ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన శేషాద్రి. సీజేఐ చంద్ర‌చూడ్ తీర్పును త‌ప్పుప‌ట్టారు. బ్లాగ‌ర్ శేషాద్రిపై 153, 153ఏ, 505(1)(బి) సెక్ష‌న్ల కింద కేసు బుక్ చేసి అరెస్టు చేశారు.
మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న హింస‌పై ఇటీవ‌ల సుప్రీంకోర్టు కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఒక‌వేళ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేక‌పోతే, అప్పుడు కోర్టే చూసుకుంటుంద‌ని చంద్ర‌చూడ్ త‌న తీర్పులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను శేషాద్రి త‌ప్పుప‌ట్టారు. 

సీజే చంద్ర‌చూడ్‌కు గ‌న్ ఇచ్చి మ‌ణిపూర్ పంపిద్దామ‌ని, అక్క‌డ ఆయ‌న శాంతి స్థాప‌న చేస్తాడో లేదో చూద్దామ‌ని శేషాద్రి త‌న ఇంట‌ర్వ్యూలో విమ‌ర్శించారు. మ‌ణిపూర్ అనేది కొండ‌లు ఎక్కువ‌గా ఉండే ప్రాంత‌మ‌ని, క్లిష్ట‌మైన ఆ ప్రాంతంలో మ‌ర్డ‌ర్లు కూడా ఎక్కువే జ‌రుగుతుంటాయ‌న్నారు. ఆ హింస‌ను మ‌నం ఆప‌లేమ‌న్న రీతిలో శేషాద్రి వ్యాఖ్య‌లు చేశారు.

అడ్వ‌కేట్ క‌వియ‌రాసు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శేషాద్రిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. సుప్రీంకోర్టు, సీజేఐ చంద్ర‌చూడ్‌ను విమ‌ర్శించ‌డం స‌రికాదు అని ఆ ఫిర్యాదులో క‌వియ‌రాసు పేర్కొన్నారు. మ‌రో వైపు బద్రి శేషాద్రి అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై ఖండించారు. సామాన్య ప్రజానీకాన్ని తమ అభిప్రాయాలను చెప్పకుండా అధికార డీఎంకే ఇలాంటి అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. పాలక ప్రభుత్వ ప్రతీకార ఎజెండాను అమలు చేయడమే పోలీసుల బాధ్యతా అని ఆయన ప్రశ్నించారు.