కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలది ముక్కోణపు ప్రేమ కథ అని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఢిల్లీలోని పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. చేరినవారిలో కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి ఉన్నారు.
కేంద్ర మాజీ మంత్రి – తెలంగాణ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవడేకర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు – బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు డా. కే. లక్ష్మణ్ ల సమక్షంలో ఈ నలుగురు పార్టీలో చేరారు.
వారికి తరుణ్ చుగ్ కండువగా కప్పి స్వాగతించగా, కిషన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ ఈ చేరికలు కేవలం ఆరంభం మాత్రమేనని, ఇకపై పెద్ద ఎత్తున కొనసాగుతాయని చెప్పారు. గత రెండున్నరేళ్లలో పెద్ద సంఖ్యలో వచ్చి చేరారని, ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత మంది వస్తారని తెలిపారు.
రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి, అహంకార, కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని, కేసిఆర్ పాలన నుంచి ముక్తి లభిస్తుందని చెబుతూతెలంగాణ ప్రజల అసలైన విజయమని, కచ్చితంగా జరిగి తీరుతుందని తెలిపారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ యువతలో బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని, కేసిఆర్ అహంకార, కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయని, కాంగ్రెస్‌లో గెలిచిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారని గుర్తుచేశారు.
మోదీ సర్కారు మీద ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ఈ మూడు పార్టీలు సంతకాలు చేశాయని, ఇదే ఆ పార్టీల మధ్య బంధానికి ఉదాహరణ అని ఆరోపించారు. ఎన్నికలకి ముందు, లేదంటే ఎన్నికల తర్వాత కలిసి పనిచేస్తాయని, కలిసే ప్రయాణం చేస్తాయని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీల మధ్య ముక్కోణపు ప్రేమ కథ ఈ నడుస్తోందని విమర్శించారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
చైనా జలవిద్యుత్ డ్యామ్ లతో 12 లక్షల మంది టిబెటన్ల నిరాశ్రయం