కాటన్‌ బ్యారేజీ వద్ద మహోగ్ర రూపం

ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో అఖండ గోదావరి ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక, దిగువన ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరినదికి వరద ముంచెత్తింది. గంటల తరబడి నిలకడగా ప్రవహిస్తూ, మరలా పెరుగుతూ తీరప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురిచే స్తోంది. 
 
ప్రశాంతంగా పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గోదారమ్మ జూలై 20వ తేదీనుంచి తన స్వభావానికి విరుద్ధంగా ఉప్పొంగి ఉగ్రరూపం దాల్పింది. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో స్నానఘట్టాలను పూర్తి గా ముంచెత్తి క్షేత్రంలోకి ప్రవేశించింది. గోదావరి కాటన్‌ బ్యారేజీ వద్ద మహోగ్ర రూపం దాల్చింది. లంకలను చుట్టిముట్టింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 
 
శనివారం రాత్రి నుంచి క్రమంగా పెరిగిన గోదావరి ఆదివారం ఉదయానికి మరింత వేగం పుంజుకుంది. ఇక్కడ గంట గంటకు వరద తీవ్రత పెరిగింది. 
ఉదయం 11.30 గంటలకు 15.75 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుండి సముద్రంలోకి 15,96,464 నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద వరద నిలకడగా ఉంది. అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక ఇంకా అమల్లోనే ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 54.39 అడుగుల నీటి మట్టం నమోదైంది. 
 
వరద నీటి ప్రవాహం పెరగడంతో లంకల ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అన్ని రేవులు, స్నానఘట్టాలను అధికారులు మూసేశారు. పి.గన్నవరంలో కనకాయలంక నీట మునిగింది. అక్కడ ప్రజలు పడవులపై ప్రయాణాలు సాగిస్తున్నారు.  రాజమండ్రిలో బ్రిడ్జి లంక ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పనివాని లంక, అప్పనపల్లి, పాసర్ల పూడి, పి.గన్నవరం మండలంలో 30 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి.
 
కాగా, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి గంట, గంటకు పెరుగుతున్న నేపథ్యంలో … లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి వశిష్ట గోదావరి మరింత ఉధృతంగా మారింది. ధవళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు సముద్రంలోకి వదులుతుండటంతో వశిష్ట గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో లంక గ్రామాలకు వరద నీరు మెల్లమెల్లగా చేరుతుంది. మండలంలో పుచ్చలలంక, నెక్కిడిలంక, రాయిలంకలు ముంపు బారినపడ్డాయి. అయోధ్య లంకలో పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంది. అయోధ్య లంకలో ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. లంక వాసులకు రాకపోకలు నిలిచిపోవడంతో వారు నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారు.