తగ్గుతున్న గోదావరి, కృష్ణా వరద ప్రవాహం

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి, కృష్ణా నదులలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.  గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద కూడా సోమవారం ఉదయానికి తగ్గిపోయింది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 15.87లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆదివారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగింది. ఆదివారం నీటిమట్టం 49.5 అడుగులు ఉండగా తెల్లారేసరికి 46అడుగులకు తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద నిలకడగా ఉందని ప్రస్తుతానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.87లక్షల క్యూసెక్కులు ఉంది. 

వరదలు తగ్గు ముఖం పట్టినా ముంపు తగ్గకపోవడంతో 4 ఎన్డీఆర్ఎఫ్,  6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయ చర్యలు చేపట్టారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు జారీచేస్తున్నామని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు.

భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో మూడో ప్రమాద హెచ్చరికను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్దకు ప్రవాహం 12,79,307 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 56 అడుగుల నుంచి 50.4 అడుగులకు తగ్గింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు ఆగి పోవడంతో గోదావరిలో వరద తగ్గుతోంది.

శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం 8,100 క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 44,354, పార్వతి బ్యారేజ్‌ వద్ద 30,150, సరస్వతి బ్యారేజ్‌ వద్ద 43,615 క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ నుంచి 5.71 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజ్‌ నుంచి 9.15 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. శ్రీరామ్‌ సాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి ప్రవాహం తక్కువగా ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద సోమవారం మరింతగా తగ్గుతుందని భావిస్తున్నారు.

వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 82,055 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో నీటిమట్టం 846.7 అడుగులకు పెరిగింది. నీటినిల్వ 73.23 టీఎంసీలకు చేరుకుంది.

శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా పూర్తినిల్వ 215.81 టీఎంసీలు ఉంది.పూర్తి స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 142 టీఎంసీలు అవసరం అవుతాయి. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లు ఇప్పటికే నిండడంతో ఇకపై కురిసే వర్షాల వల్ల ఆ డ్యామ్‌లలోకి వచ్చే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలంతోపాటు, నాగార్జునసాగర్‌ కూడా ఆగస్టులో నిండుతాయని అధికారవర్గాలు భావిస్తున్నాయి

కృష్ణా బేసిన్‌లో పులిచింతల ప్రాజెక్టులోకి మూసీ నుంచి 11,755 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 32 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 13 టీఎంసీలు అవసరం. మున్నేరు, కట్టలేరు, బుడమేరు తదితర వాగులు, వంకల్లో ప్రవాహం తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న వరద కూడా తగ్గింది. 

ప్రకాశం బ్యారేజ్‌లోకి 48,696 క్యూసెక్కులు చేరుతుండగా నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో ఆ నీటిని గేట్ల ద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. జూన్‌ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 46.715 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.