సెమీకండక్టర్ల పరిశ్రమకు భారత్ రెడ్‌ కార్పెట్‌

సెమీకండక్టర్ల పరిశ్రమకు తమ ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ పరుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సెమీకండక్టర్ల తయారీ కోసం కొత్త యూనిట్లను ఏర్పాటు చేసే సంస్థలకు 50 శాతం ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో శుక్రవారం జరిగిన సెమికాన్‌ ఇండియా-2023 సదస్సును ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  ప్రపంచ పారిశ్రామిక విప్లవాలకు వివిధ సమయాల్లో ప్రజలు వెలిబుచ్చిన ఆకాంక్షలే కారణమని తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవం(4.0) భారత ఆకాంక్షలకు అద్దంపడుతుందని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. దేశంలో సెమీకండక్టర్‌ పరిశ్రమ వృద్ధి చెందేలా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

 ‘‘సెమికాన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా మేం అనేక రాయితీలు ఇస్తున్నాం. ఇప్పుడు వీటిని మరింత పెంచాం. సాంకేతిక సంస్థలకు 50 శాతం  వరకు ఆర్థిక సాయం అందిస్తాం’’ అని మోదీ చెప్పారు. దేశ పురోగతికి సెమీకండక్టర్‌ పరిశ్రమ సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు.  ‘‘ఏడాది కిందట భారత్‌లో పెట్టుబడులు ఎందుకు పెట్టాలని కొందరు ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు వారే ఎందుకు పెట్టుబడులు పెట్టకూడదని అంటున్నారు. సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది’’ అని వివరించారు. 

రానున్న ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 300 కాలేజీల్లో సెమీకండక్టర్‌ డిజైన్‌ కోర్సులు ప్రవేశ పెట్టనున్నట్టు ప్రధాని వెల్లడించాయిరు. దీంతో లక్ష మందికిపైగా డిజైన్‌ ఇంజనీర్లు అందుబాటులోకి వస్తారని చెప్పారు. ప్రపంచ పారిశ్రామిక రంగం 4.0కు చేరుకుందన్న ప్రధాని, తొలి పారిశ్రామిక విప్లవానికి అమెరికాకు ఎలాంటి సంబంధం ఉందో నాలుగో పారిశ్రామిక విప్లవానికి, భారత్‌కు అలాంటి బంధమే ఉందని స్పష్టం చేశారు.

ప్రపంచంలో తన బాధ్యత ఏమిటో భారత్‌ అర్థం చేసుకుందని, అందుకే మిత్రదేశాలతో కలిసి అనేక కార్యక్రమాలకు రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేసినట్టు ప్రధాని వివరించారు. ఇటీవలే క్వాంటమ్‌ సాంకేతికతకు పెద్దపీట వేస్తూ నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌ను అనుమతించామని, త్వరలోనే నేషన్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నామని మోదీ తెలిపారు. 

సెమీకండక్టర్ల పరిశ్రమకు విద్యుత్‌ అత్యంత కీలకమని, అందుకే సౌర విద్యుత్‌ సామర్థ్యాన్ని గత దశాబ్దకాలంలో 20 రెట్లు వృద్ధి చేశామని మోదీ చెప్పారు. ఈ దశాబ్దం చివరినాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. విధానపరమైన సంస్కరణలు సెమీకండక్టర్‌ ఎకోసిస్టమ్‌కు దన్నుగా నిలుస్తాయని చెప్పారు. 

కార్పొరేట్‌ పన్నులను తక్కువగా విధించే దేశాల సరసన భారత్‌ కూడా చేరిందని తెలిపారు. కాలం చెల్లిన చట్టాలను బుట్టదాఖలు చేశామని, తద్వారా సెమీకండక్టర్ల పరిశ్రమకు రెడ్‌ కార్పెట్‌ పరిచామని వివరించారు. ‘‘సెమీకండక్టర్‌ పరిశ్రమకు భారత్‌ అతిపెద్ద కండక్టర్‌గా అవతరించింది’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రధాని ప్రకటించారు. ‘‘భారత దేశ ప్రజాస్వామ్యం, ప్రజలు, రాయితీలు వంటివి మీ వ్యాపారాలను రెండింతలు, మూడింతలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని మోదీ భరోసా ఇచ్చారు.