సీబీఐకి మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు కేసు

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేసు విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అస్సాంలోని కోర్టు ఈ కేసు విచారణను చేపట్టే అవకాశముంది. అందుకోసం సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయనుంది.
 
మహిళల నగ్న ఊరేగింపును వీడియో తీసేందుకు ఉపయోగించిన మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దానిని చిత్రీకరించిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తున్నది.  ఈ దారుణ ఘటనకు ప్రధాన కారకుడైన హుయిరెమ్ హెరోదాస్ మెయితీ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
 
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మీతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను అల్లరిమూకలు నగ్నంగా ఊరేగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పార్లమెంట్‌ను సైతం ఈ ఘటన కుదిపేసింది. పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాయి.
 
ఇలా ఉండగా, మణిపూర్‌లో జరుగుతున్న ఈ హింసాత్మక ఘటనలకు కారణమైన మెయితీ, కుకీ తెగలకు చెందిన వారితోనూ కేంద్ర హోంశాఖ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మణిపూర్‌లో త్వరలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఈ చర్చల ప్రక్రియ చివరి దశకు చేరుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
మెయితీ, కుకీ వర్గాల మధ్య మణిపూర్‌లో మే 3 వ తేదీన ప్రారంభమైన ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు దాదాపు 200 మంది మృతి చెందారు. వేలాది మంది ఇళ్లు, ఊర్లు వదిలేసి నిరాశ్రయులుగా ప్రభుత్వ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మెయితీ, కుకీ తెగలకు చెందినవారితోపాటు పోలీసులు, సైన్యం, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. 
 
మే 3 వ తేదీ నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తెలుస్తోంది. మణిపూర్‌లోని పోలీసులకు చెందిన పోలీస్ స్టేషన్లు, ఆయుధాగారాలపై ఆందోళన కారులు దాడులు చేసి వేల సంఖ్యలో ఆయుధాలను దోచుకెళ్లినట్లు సమాచారం. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 35,000 మంది సాయుధ దళాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. మందులు, నిత్యావసర వస్తువుల కొరత లేదని, ధరలు సహితం అదుపులోకి వచ్చాయని చెప్పారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరవుతునట్లు, పాఠశాలలు తెరుచుకున్నట్లు ఆ వర్గాలు వివరించాయి.

మరోవంక, మణిపూర్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రతిపక్షాల కూటమి ‘ఇండియాకు చెందిన ఎంపీల బృందం ఈ నెల 29, 30 తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. 20 మందికి పైగా ఎంపిల బృందం రెండు రోజలు పాటు మణిపూర్‌లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటుందని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మానిక్కం ఠాగూర్ తెలియజేశారు.

ఈ బృందం మణిపూర్ లోయతో పాటు కొండప్రాంతాలను కూడా సందర్శించి వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడుతుంది. బృందం కొన్ని పునరావాస శిబిరాలను కూడా సందర్శించే అవకాశం ఉంది. ఈ బృదంలో మహిళా ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుస్మితా దేవ్, జెఎంఎంకు చెవిన మహువా మఝి, ఎన్‌సిపికి చెందిన వందనా చవాన్ ఉండారని తెలుస్తోంది.