దేశంలో జమిలి ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కావు

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చలు, ఊహాగానాల సాగుతున్న నేపథ్యంలో  పార్లమెంట్‌లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రకటనతో వీటికి చెక్‌ పెట్టినట్లయ్యింది. 

జమిలి ఎన్నికలపై రాజ్యసభలో  ఎంపీ కిరోడిలాల్ మీనా అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, రాష్ట్రాల విధానసభ ఎన్నికలు నిర్వహణ అంత తేలిక కాదని తేల్చి చెప్పారు  ఒకేసారి ఎన్నికలు జరుపడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని, అయితే ఇందుకు అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు సైతం ఉన్నాయని చెప్పారు.

లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, ఎన్నికల నిర్వహణ కోసం పెట్టే ఖర్చు పెద్ద మొత్తంలో ఆదా అవుతుందని, తద్వారా ప్రజాధనాన్ని ఆదా చేయడంతో పాటు పదే పదే ఎన్నికల నియమావళి అమలు చేయడం కారణంగా తలెత్తే పాలనాపరమైన ఇబ్బందులను కూడా పరిమితం చేయవచ్చని పేర్కొన్నారు. 

అయితే ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా సమస్యలు అధిగమించాల్సి ఉంటుందని వెల్లడించారు. ముఖ్యంగా రాజ్యాంగంలోని 5 కీలకమైన అధికరణాలను సవరించాల్సి ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ పదవీకాలాన్ని నిర్వచించే ఆర్టికల్ 83, పార్లమెంటును రాష్ట్రపతి రద్దు చేసే అధికారం కల్గిన ఆర్టికల్ 85, రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలాన్ని నిర్వచించే ఆర్టికల్ 172, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు చేసే అధికరణ ఆర్టికల్ 174తో పాటు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ 356ను సవరించాల్సి ఉంటుందని వివరించారు.

అదే సమయంలో, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తితో నిర్మితమైన ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలకు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోవడంతోపాటు ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుందని కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికలు పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపాట్స్ మిషన్స్ అవసరమని, అందుకు రూ.వేల కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. 

ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పని చేయవని, ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్దఎత్తున డబ్చు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు.  అదే సమయంలో ఒకేసారి జరిగే ఎన్నికలకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరమవుతాయని తెలిపారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కేంద్ర సిబ్బంది, న్యాయ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన చేసిందని మేఘ్వాల్ తెలిపారు. 

కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిందని, తదుపరి విధాన రూపకల్పన జాతీయ లా కమిషన్‌ పరిశీలనలో ఉందని న్యాయశాఖ మంత్రి స్పష్టం చేశారు.