పైరసీకి పాల్పడితే మూడేండ్ల జైలు

సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. పైరసీని అరికట్టడానికి కఠినమైన నిబంధనలను ఇందులో పొందుపర్చామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్  తెలిపారు. ఓటీటీల్లో ప్రదర్శించే అభ్యంతరకర కంటెంట్ కు సంబంధించి, ఆయా ఓటీటీ ప్లేయర్స్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
 
సినిమా పైరసీకి పాల్పడేవారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానా విధించేలా నిబంధనలు పొందుపరిచారు. పదేండ్లు చెల్లుబాటయ్యేలా ఇప్పటివరకు సినిమాలకు సర్టిఫికెట్లు జారీచేస్తుండగా, ఇకపై దానికి ఎత్తివేసి శాశ్వత సర్టిఫికెట్‌ జారీచేయనున్నారు. 
 
అలాగే వయసువారీగా ‘యూఏ’ సర్టిఫికెట్‌ జారీచేయాలని ప్రతిపాదించారు. ఇకపై యూఏ 7ప్లస్, యూఏ 13ప్లస్‌, యూఏ 16 ప్లస్‌ సర్టిఫికెట్లు జారీచేయనున్నారు. టెలివిజన్‌, ఇతర మాధ్యమాల్లో ప్రసారానికి ప్రత్యేక సర్టిఫికెట్‌ జారీచేసేందుకు సీబీఎఫ్‌సీ(సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌) కి అనుమతించారు.

1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టానికి కీలక సవరణలు చేసి, ఈ బిల్లును రూపొందించారు. బిల్లుపై రాజ్యసభలో రెండు గంటలకు పైగా చర్చ జరిగింది. చర్చలో జీవీఎల్ నరసింహరావు సహా పలువురు బీజేపీ సభ్యులు, వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి, డీఎంకే సభ్యుడు తంబిదురై, బీజేడీ సభ్యుడు, సినీ దర్శకుడు ప్రశాంత నందా తదితరులు పాల్గొన్నారు. 

సినిమా బడ్జెట్ లో సింహభాగం ఆ సినిమాలో నటించే స్టార్ హీరోలే తీసుకుంటున్నారని, సామాన్య కార్మికులకు, చిన్న నటులకు సరైన రెమ్యూనరేషన్ అందడం లేదని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటీటీలో చాలా అభ్యంతరకర కంటెంట్ ప్రదర్శితమవుతోందని బీజేడీ సభ్యుడు, సినీ దర్శకుడు ప్రశాంత నందా, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు సహా పలువురు సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు.

 ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు. దీనిపై మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. వారం క్రితం తాను ఓటీటీ ప్లేయర్స్ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించానని తెలిపారు. ఓటీటీ ప్లేయర్స్ తమ ప్లాట్ ఫామ్స్ పై ప్రదర్శితమయ్యే కంటెంట్ విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని సూచించానని వెల్లడించారు. 

స్వీయ నియంత్రణ అంటే.. అభ్యంతరకర కంటెంట్ ప్రదర్శితం కాకుండా బాధ్యత వహించడమేనని వారికి స్పష్టం చేశానని వివరించారు. ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించకుంటే.. ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వస్తుందని వారిని హెచ్చరించామని తెలిపారు. పైరసీని పూర్తిగా రూపుమాపే లక్ష్యంతో ఈ బిల్లులో కఠిన చర్యలను ప్రతిపాదించామని మంత్రి చెప్పారు. సినిమాను రూపొందించిన వారి సంవత్సరాల కష్టాన్ని, డబ్బును టెక్నాలజీ సాయంతో క్షణాల్లో కొట్టేస్తున్నారని, ఈ పైరసీని అడ్డుకోవడం సినిమా పరిశ్రమ పురోగతికి చాలా అవసరమని మంత్రి తెలిపారు. 

అందువల్ల ఈ పైరసీకి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేలా ప్రతిపాదనలను రూపొందించామన్నారు. అలాగే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సి) లో పూర్తిగా మార్పులు చేశామని, సీబీఎఫ్సీ కి పూర్తి అధికారాలతో స్వయం ప్రతిపత్తి ఉండేలా ఈ బిల్లులో నిబంధనలను పొందుపర్చామని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.