ఉగ్రవాద మచ్చ తొలగింపుకే `ఇండియా’గా మార్చారు

మోసపూరిత కంపెనీలు తమ పాత తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు తమ పేర్లను మార్చుకునే విధంగా కాంగ్రెస్ ఉగ్రవాదం ముందు లొంగిపోయిన మచ్చను తొలగించుకొనేందుకే యుపీయేని `ఇండియా’గా మార్చుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. కొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో సికర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కాంగ్రెస్ దిశా,నిర్ధేశం లేని పార్టీగా మారిపోయిందని విమర్శించారు.
 
 “కాంగ్రెస్ దిశా, నిర్ధేశం లేని పార్టీగా మారింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గతంలో మోసం చేసిన కంపెనీల మాదిరిగానే తమ పేర్లను మార్చుకున్నాయి. ఉగ్రవాదం ముందు లొంగిపోయిన మరకను తొలగించడానికి వారు తమ పేరును మార్చుకున్నారు. వారి మార్గాలు అలాంటివే: అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
 
ఇండియా అనే పేరు తమ దేశభక్తిని చాటుకోవడానికి కాదని, దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇండియా పేరుతో వారు తమ పాత తప్పిదాలని, యుపిఎ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. నిజంగా దేశం పట్ల వారికి గౌరవం ఉంటె భారత దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకోమని విదేశీయులను అడుగుతారా? అని ప్రశ్నించారు.
 
వారు ఒకప్పుడు ‘ఇందిరానే ఇండియా.. ఇండియానే ఇందిరా’ అనే  నినాదాన్ని ఇచ్చారని ప్రధాని గుర్తు చేశారు. ఆ సమయంలో వారిని ప్రజలు తిరస్కరించారని అంటూ ఈ దురహంకారులే మళ్లీ ‘యూపీఏనే ఇండియా.. ఇండియానేయూపీఏ’ అన్నారని, ప్రజలు మరోసారి అలాగే తిరస్కరించారని గుర్తు చేశారు.
 
“మహాత్మా గాంధీ ఒకప్పుడు – క్విట్ ఇండియా – ‘ఆంగ్లేయులు ఇండియా నుండి వెళ్ళిపోవాలి’ అని నినాదం ఇవ్వడంతో  బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్ళవలసి వచ్చిందని ప్రధాని తెలిపారు. అదేవిధంగా, తాము సంపన్న భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పం తీసుకున్నామని చెప్పారు. మహాత్మా గాంధీ వలె ‘క్విట్ ఇండియా’ నినాదం మాదిరిగా నేటి మంత్రం ‘భ్రష్టాచార్ (అవినీతి) క్విట్ ఇండియా’, ‘పరివార్వాద్ (వారసత్వ రాజకీయం) క్విట్ ఇండియా’, ‘తుష్టికరణ్ (బుజ్జగింపు) క్విట్ ఇండియా’. మాత్రమే దేశాన్ని కాపాడుతుందని ప్రధాని మోదీ తెలిపారు.
 
`రెడ్ డైరీ’లో కాంగ్రెస్ చీకటి రహస్యాలు

ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ పై ఘాటైన విమర్శలు చేస్తూ కాంగ్రెస్ చీకటి రహస్యాలను రెడ్ డైరీ బయటపెడుతుందని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ చీకటి వ్యవహారాల రికార్డులు ఈ రెడ్ డైరీలో ఉన్నాయని అంటున్నారని అంటూ దీనిలోని పేజీలను తెరిస్తే, చాలా ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారని తెలిపారు. 

‘రెడ్ డైరీ’ గురించి ప్రస్తావించడంతో కాంగ్రెస్ పార్టీలోని పెద్ద నేతలు మౌనం దాల్చారని దుయ్యబట్టారు. దీని గురించి మాట్లాడకుండా పెదవులను కుట్టేసుకున్నా, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగలబోతోందని ప్రధాని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ‘అబద్ధాల దుకాణం’లో ‘రెడ్ డైరీ’ తాజా ప్రాజెక్టు అని ఎండగట్టారు.

రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటోందని మోదీ విమర్శించారు. నేడు రాజస్థాన్‌లో ఒకే ఒక నినాదం మారుమోగుతోందని, అది ‘కమలం విజయం సాధిస్తుంది – కమలం వికసిస్తుంది’ అని చెప్పారు. రాష్ట్ర ప్రజలు తాగునీటి కోసం అలమటించేలా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటోందని ప్రధాని మండిపడ్డారు. ఆడ బిడ్డలపై దురాగతాలను రాజస్థాన్ సహించబోదని ప్రధాని హెచ్చరించారు.