భారత ప్రజలపై చైనా సోషల్ మీడియా వల

– అయ్యప్ప. జి
 

3 సెప్టెంబర్ 2021న ఢిల్లీకి చెందిన పరిశోధనా సంస్థ ‘లా అండ్ సొసైటీ అలయన్స్’ విడుదల చేసిన నివేదికలో భారతదేశంలోని వివిధ విభాగాలు, ప్రజలను తమకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి చైనా పాల్పడుతున్న బహిరంగ, రహస్య కార్యకలాపాల గురించి వివరిస్తుంది. అందుకోసం భారత్ లోని సంస్థలు, మీడియా విభాగాలు, వ్యక్తిగత అభిప్రాయాలతో సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులకు అవసరమైన ఏర్పాట్లు, ఆర్ధిక నిధులు సమకూర్చే బాధ్యత చైనా నియంత  జింగ్ పింగ్ నేతృత్వంలోని అధికార చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) చేపట్టింది. తమకు అనుకూలంగా వ్యవహరించే వారికి ఆర్థిక పెట్టుబడులు, విద్యార్థులకు ఫెలోషిప్‌లు, టూరిస్టులకు ప్రయాణ ఏర్పాట్లు వంటి అనేక మార్గాల ద్వారా భారతీయ సమాజంలోకి చొచ్చుకుపోయేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు దీర్ఘకాలంలో చాలా హాని కలిగిస్తాయనేది ఆ రిపోర్ట్ సారాంశం. చైనా ఇప్పటికే భారతీయ వినోద పరిశ్రమలోకి చొరబడిందని, ఇప్పుడు దాని దృష్టి నేరుగా థింక్ ట్యాంక్‌లు, విద్యా కేంద్రాలపై పడిందని నివేదిక పేర్కొంటోంది.

అందుకు కొత్తగా ఢిల్లీలో ఏర్పాటైన ఓ సంస్థ భారతీయులలో చైనాకు అనుకూలమైన భావాలను సృష్టించేందుకు చురుగ్గా పనిచేస్తోందని, అందుకు రాయబార కార్యాలయానికి సమానమైన హోదాతో విధులు నిర్వర్తిస్తోందని నివేదిక పేర్కొంది.  ఈ సంస్థ ద్వారా ఎంపికైన వ్యక్తులను  ‘విద్య’ పేరుతోనో, వాణిజ్యం, టూరిజం పేరుతోనో చైనాకు పంపుతారు. అక్కడ తగిన ‘శిక్షణ’ తరువాత వాళ్ళు  చైనీస్ ప్రభుత్వానికి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలమైన భావాలు భారత్ లో వ్యాప్తి చేసే పనిలో పడతారు.

ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్లి చుస్తే, 2000 సంవత్సరం నాటికి అమెరికా అగ్రరాజ్యం హోదాలో ఉండేది. అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యాన్ని అంతం చేసి ఆర్థిక, వాణిజ్య, ఆయుధ రంగాల్లో చైనా ప్రబలశక్తిగా ఆవిర్భవించటం వెనుక చైనీస్ కమ్యూనిస్టు పార్టీ మీడియా మేనేజ్మెంట్ కృషి కూడా చాలా ఉంది. మొదట్లో హాలీవుడ్ సినిమాలకు పరోక్షంగా ఫండింగ్ చేసి చైనా కథాంశాలను ప్రధాన ఇతివృత్తంగా జాకీచాన్, జెట్ లీ వంటి హీరోలతో ప్రముఖ హాలీవుడ్ నటులు కలిసి నటించేలా స్క్రిప్ట్ రూపొందించేవారు. షాంఘై నూన్, రష్ అవర్ వంటి అనేక హిట్ సినిమాల ద్వారా అమెరికన్ capitalist పౌరుల మనసుల్లో  కమ్యూనిస్టు చైనాపై ఉండే నెగిటివ్ అభిప్రాయాన్ని చెరిపేసి పరోక్షంగా అమెరికా-చైనా భాయ్ భాయ్ అనే భావనను నాటారు.

2002లో విడుదలైన రజనీకాంత్ బాబా సినిమాలో ఒక కోయదొర పాత్ర  తన ఫోన్ ను చూపుతూ “మేడిన్ చైనా, టచ్ స్క్రీన్” అనే డైలాగ్ ఉంటుంది. అది పెయిడ్ ప్రమోషనో కాదో తెలియదు కానీ చైనా ఫోన్లంటే డబ్బాఫోన్లని, మాస్ జనాలు వాడేవనే నాటి అభిప్రాయాన్ని ఆ సీన్ చెబుతుంది. అప్పట్లో నోకియా, బ్లాక్ బెర్రీ, మోటరోలాలు మాత్రమే ప్రముఖ బ్రాండ్లు. తరువాత మోటరోలాను లెనోవో కంపెనీ టేకోవర్ చేసి భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాల్లో ప్రధాన పాత్రలు లెనోవో వంటి చైనీస్ బ్రాండ్ లాప్ టాప్ లను, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను వాడుతున్నట్టు చూపేవారు. సినిమాల్లో అంతర్లీనంగా ఉండే ప్రమోషన్ ఇది. దీనికి తోడు ఒబామా తన పాలనాకాలంలో అమెరికా అవుట్ సోర్సింగ్ కార్యక్రమానికి గేట్లెత్తేసి చైనా రివర్స్ ఇంజినీరింగ్ కు, కాపీరైట్ అండ్ డిజైనింగ్ చౌర్యాలకు పరోక్షంగా సహకరించిన ఫలితంగా పదేళ్లు తిరిగేసరికి ఐఫోన్ తో సహా మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో పాటు మొత్తం తయారీ రంగంలో చైనా డామినేషన్ మొదలైంది. అమెరికా పాలిట మన్మోహన్ సింగ్ అని ఒబామాను అభివర్ణించవచ్చు.

ఇప్పుడు మళ్లీ భారతదేశం వంతు వచ్చింది. 2013లో జీ జిన్ పింగ్ చైనా అధ్యక్షుడయ్యాక “చైనా గురించి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ప్రచారం చేయండి” అని చైనీస్ మీడియా సంస్థలకు ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు సోషల్ మీడియా ప్రభావం అంతగా లేకపోవడంతో ది హిందూ లాంటి చైనా అనుకూల పత్రికలలో, ది  ప్రింట్, స్క్రోల్, ది వైర్ వంటి వెబ్ పోర్టల్లలో బాహాటంగా చైనా భజన మొదలయ్యింది. భారతదేశంలో సోషల్ మీడియా విప్లవం తరువాత ఏర్పడిన ఢోక్లాం వివాదం తరువాత బాయ్ కాట్ చైనా ఉద్యమం ఊపందుకుంది. దీంతో చైనాబజార్ వ్యాపారులు బోర్డులు మార్చి బొంబాయి బజార్ వంటి ఇతర పేర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా తయారీ సంస్థలు కూడా మేడిన్ చైనా లేబుల్ స్థానంలో మేడిన్ PRC అని రాసుకుని అమ్ముకునే దుఃస్థితి వచ్చింది. ప్రపంచ వాణిజ్యరంగ చరిత్రలో ఏ దేశం ఇలా దొంగ పేరు పెట్టుకుని వ్యాపారం చేయలేదు.

ఇటీవల సంవత్సరాల్లో ప్యాగ్యాంగ్ సరస్సు వద్ద మళ్ళీ సైనిక ఘర్షణ జరిగి భారత సైనికులు మరణించటం, ఓప్పో, వివో కంపెనీలపై ఆర్థిక నేరాలు నమోదు కావటం, టిక్ టాక్, చైనీస్ లోన్ యాప్ లపై నిషేధం వంటి ఘటనలు భారత ప్రజల్లో చైనా పట్ల వ్యతిరేకతను బాగా పెంచాయి. సహజంగానే వీటి ప్రభావం భారత కమ్యూనిస్టు పార్టీల మీద నేరుగా పడి వారి విశ్వసనీయత ప్రమాదంలో పడటంతో పాటు, వాటి రాజకీయ ప్రభావం కూడా క్షీణించింది. అదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి చైనాలో 50 కోట్ల మంది అభిమానులున్నారని ఒక సర్వే చెప్పటంతో వీబో వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పదహారు లక్షల భారత అనుకూల పోస్ట్ లను చైనా ప్రభుత్వం బలవంతంగా డిలీట్ చేయించింది.

ఇప్పుడు వీటన్నింటినీ తలదన్నేలా ఐఫోన్, ఫాక్స్ కాన్ తయారీ యూనిట్ చైనా నుంచి భారత్ కు తరలిపోవటం చైనాకు పెద్ద షాక్ అని చెప్పాలి. దీని తరువాత చైనా మీడియా మేనేజ్మెంట్ సరికొత్త వ్యూహాలు అమలుచేస్తుంది. ప్రింట్ మీడియా ప్రభావం బాగా తగ్గటంతో  సోషల్ మీడియా వేదికగా భారతీయ భాషల్లో వేలకొద్దీ పేజీలు నేరుగా చైనా నుంచే పబ్లిష్ అవుతున్నాయి. వేలాది యూట్యూబ్ ఛానెల్స్ చైనా విజయాల గురించి చిలువలు పలువలుగా వర్ణిస్తున్నాయి.  ఇక ముందు ముందు చైనా కంటెంట్ అంతర్లీనంగా ఉండే వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్ లు, సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇటీవల చైనా గురించి సానుకూలంగా వీడియోలు చేసిన ఒక తెలుగు యూట్యూబర్ తనకు ఒక్కనెలలో ముప్పై లక్షల ఆదాయం వచ్చిందని బాహాటంగానే చెప్పాడు. గతంలో అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా చైనాలో 1500 కోట్లు వసూలు చేసిందనే వార్త గుర్తుందా? చైనా కుమ్మరించే డబ్బుతో నకిలీ వ్యూస్, నకిలీ కలెక్షన్స్ రావటం పెద్ద వింతేమీ కాదు. మళ్ళీ భారతదేశంలో చైనా పార్టీలను, చైనా కంపెనీలను జాకీలు పెట్టి లేపి లాభాలు దండుకోవటం, సరిహద్దు వివాదం ఏర్పడిన సమయాల్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయటం చైనావాడి అసలు లక్ష్యం. ఇది ఇలాగే కొనసాగితే ఇరవైయ్యేళ్ళ క్రితం చైనా అమెరికాలో ఆడిన గేమ్ భారతదేశ సోషల్ మీడియాలో రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది.

(రచయిత సామాజిక, సమకాలీన అంశాల విశ్లేషకులు)

Source: VSK Telangana