అధికారంకు అందనంత దూరంలో తెలంగాణ కాంగ్రెస్!

కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ లో కొంచెం జోష్ పెరిగింది. ఇతర పార్టలలో సీట్లు రావనుకొంటున్న పలువురు ఆ పార్టీలో చేరుతూ ఉండడంతో ఇక తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు భావిస్తున్నారు. అయితే ఎన్నికల సరళిని నిశితంగా అధ్యయనం చేయడంతో పాటు, గత మూడు నెలలుగా తెలంగాణాలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తున్న ఎన్నికల అధ్యయన సంస్థ పీపుల్స్ పల్స్ ప్రకారం కాంగ్రెస్ తెలంగాణాలో గెలుపొంది, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.

తెలంగాణాలో మొత్తం 119 సీట్లు ఉండగా, 2009 నుండి ఏ ఎన్నికలలో కూడా ఆ పార్టీ 50 నియోజకవర్గాలను మించి ఎప్పుడూ గెలవడంలేదు. అంటే ఆ పార్టీ అసలు గెలిచే అవకాశాలు లేని సీట్లు 69 ఉన్నాయని పీపుల్స్ పల్స్ లో పరిశోధకుడు జి. మురళి కృష్ణ చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి 30 నుండి 35 సీట్లకు మించి దాటే అవకాశాలు లేవని, అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు గెలుచుకొనే పరిస్థితులు లేవని స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇక్కడి నుండి 16 లోక్ సభ సీట్లను గెలిపించి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీకి 2014 ముందు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో సిఎస్డిఎస్- లోక్ నీతి జరిపిన సర్వే ప్రకారం 44 శాతం మంది తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ కారణం అని కూడా చెప్పారు. కేవలం 16 శాతం మంది మాత్రమే బిఆర్ఎస్ అని చెప్పారు. అయితే సమర్థవంతమైన నాయకత్వం లోపించడంతో సీట్లు గెలవలేకపోయింది. ఇప్పటికీ పరిస్థితులలో పెద్దగా మార్పు లేదు.

2009లో వై ఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం జరిగిన అన్ని ఉపఎన్నికలు, రెండు సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతూ వస్తున్నది. 52 స్థానాల్లో ఒక్క సారి కూడా కాంగ్రెస్ గెలుపొందలేదు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రామస్థాయిలో బలహీనమౌతూ వస్తున్నది.

2018 ఎన్నికల్లో కేవలం 6 నియోజకవర్గాలలో మాత్రమే కాంగ్రెస్ కు 50 శాతంకు మించి ఓట్లు వచ్చాయి. గెలుపొందిన 19 మందిలో 12 మంది పార్టీ ఫిరాయించగా, కాంగ్రెస్ ఉపఎన్నికల్లో మరో సీటు కోల్పోయింది. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఎమ్యెల్యేలు ఉన్నారు.  2014, 2018 ఎన్నికల్లో గెలుపొందిన వారు పార్టీ మారడంతో, ఇపుడు గెలిపించినా ఎంతవరకు కాంగ్రెస్ లో కొనసాగుతారని అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. ఇటువంటి అనుమానాలను ప్రజలలో తొలగించేందుకు కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. 

పైగా, వరుసగా ప్రతి ఎన్నికలో కూడా ఎందుకు ఘోర వైఫల్యాలు ఎదురవుతున్నాయో ఇప్పటి వరకు ఆత్మపరిశీలన చేసుకోకుండా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తామని వారు సంబరపడటం ఊహాలోకంలో విహరించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. 

2018 ఎన్నికలో ఎందుకు ఓడిపోయామో ఇప్పటి వరకు లోతయిన విశ్లేషణ జరుపుకోలేదు. కేవలం టిడిపితో జత కట్టడంతోనే ఓడిపోయామని చెప్పుకొంటున్నారు. కానీ పలు సర్వేలలో 40 శాతం మంది ప్రజలు టిడిపితో జతకట్టడాన్నీ స్వాగతించగా, కేవలం 35 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. పలు చోట్ల టీడీపీ మద్దతు కారణంగా కాంగ్రెస్ కొన్ని సీట్లు గెల్చుకుంది కూడా. 

కాంగ్రెస్ నియమించుకున్న వ్యూహకర్త సునీల్ కొనుగోలు పార్టీ నాయకత్వంకు ఇచ్చిన నివేదిక ప్రకారం 41 నియోజకవర్గాల్లో పార్టీ  బాగోలేదు.  వివిధ సామాజిక వర్గాల మద్దతును కూడాదీసుకోవడంలో కూడా కాంగ్రెస్ వెనుకబడుతున్నది. కాంగ్రెస్ రెడ్ల పార్టీ అనే ప్రచారం జరుగుతున్నా ఆ సామాజిక వర్గంలో కూడా చాల తక్కువ మంది మాత్రమే కాంగ్రెస్ కు ఓటు వేస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.

కర్ణాటకలో మాదిరిగా తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదర్చలేక సునీల్ కనుగోలు తలకిందులవుతున్నారు. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల విషయంలో చెప్పిన సూచనలను నేతలు లెక్క చేయడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో మినహా తెలంగాణాలో కాంగ్రెస్ సందడి కనిపించడం లేదు.

గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాదు, మెదక్ వంటి జిల్లాలో మూడు, నాలుగు నియోజకవర్గాలలో మినహా బలమైన అభ్యర్థులు ఆ పార్టీలో లేకపోవడం గమనార్హం.