తిరిగి అధికారంలోకి ఎన్‌డిఎనే.. మోదీ విశ్వాసం

తిరిగి తమ నేతృత్వపు ఎన్‌డిఎనే అధికారంలోకి వస్తుందని, భాతరదేశ ఆర్థిక ప్రగతి ప్రయాణం ఆగబోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ మూడో దఫా అధికార దశలో దేశం అసాధారణ రీతిలో ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒక్కటి అవుతుందని భరోసా వ్యక్తం చేశారు. 

దేశ రాజధానిలోని ప్రగతిమైదాన్‌లో పునఃనిర్మించిన భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటిపిఒ)కు బుధవారం అధికారిక ఆవిష్కరణకు ముందు ఉదయం జరిగిన పూజాదికాల దశలో ప్రధాని మాట్లాడారు. కాంప్లెక్స్ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ఆయన కలుసుకుని వారితో మాట్లాడారు. నిర్మాణాన్ని అత్యద్భుతంగా పూర్తిచేసినందుకు వారిని అభినందించారు. సన్మానించారు.

సాయంత్రం ఇక్కడనే భారీ స్థాయిలో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్ (ఐసిసిసి)ను ఒక డ్రోన్ ద్వారా ప్రారంభించారు. దీనికి `భారత్ మండపం’ అని పేరు పెట్టారు. ఈ దశలో ఆయన తమ సందేశంలో తమ మూడో దఫా అధికార హయాం గురించి మాట్లాడారు. ఈ దశలో మూడు ప్రధాన ఆర్థిక శక్తివంత దేశాలలో భారత్ ఒక్కటి అవుతుందని తెలిపారు.

తూర్పు నుంచి పశ్చిమం, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ భారతదేశపు సాధనాసంపత్తి బాగా మెరుగుపడుతోందని, ఈ మార్పు ఇప్పుడు తేటతెల్లం అయిందని చెప్పారు. పలు విధాలుగా భారతదేశంలో ప్రతిష్టాత్మక నిర్మాణాలు వెలుస్తాయని అంటూ ప్రపంచ అతి ఎతైన రైలుబ్రిడ్జి ఇక్కడనే రాబోతోందని వెల్లడించారు.

ఇదే విధంగా అత్యంత ఎతైన ప్రదేశంలో అతి పొడవైన టన్నెల్, అత్యున్నత ప్రాంతంలో వాహనాల సంచార రాదారి, అతి పెద్ద స్టేడియం, అతిపెద్ద విగ్రహం ఈ విధంగా పలు ఘనతలను మనదేశం చాటుకుంటుందని ప్రధాని వివరించారు. తమ తొలి దశ అధికారంలో దేశ ఆర్థిక వ్యవస్థ పదవ స్థానంలో ఉందని, రెండో దశలో ఇది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారిందని గుర్తు చేశారు.

ఈ విధమైన గత నేపథ్య ఘనతలను తీసుకుంటే ఇక తమ మూడో దశ అధికార కాలంలో భారతదేశం ప్రపంచంలో మూడు అతి పెద్ద ఆర్థిక శక్తివంతమైన దేశాలలో ఒక్కటి అవుతుందని మోదీ స్పష్టం చేశారు. ఇది దేశ ప్రజలకు మోదీ గ్యారంటీ అని వెల్లడించారు. 

తమ తొమ్మిదేళ్ల పాలన ప్రగతి ఒక్క ఎత్తయితే, ఆరు దశాబ్దాలలో దేశ ప్రగతి ఫలితం ఒక్క ఎత్తని చెపుతూ గడిచిన 60 ఏండ్లల దేశంలో కేవలం 20000 కిమీల మేర రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగిందని, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో తొమ్మిది సంవత్సరాల్లోనే 40వేల కిలోమీటర్ల మేర రైల్వేలైన్ విద్యుద్దీకరణ పనులు జరిగాయని తెలిపారు.

 ప్రతినెలా ఆరు కిలోమీటర్ల మెట్రోలైన్ పనులు జరుగుతున్నాయని, గ్రామాల రహదారులు మరింతగా ఏర్పడ్డాయని, ఎయిర్‌పోర్టుల సంఖ్య 150కు చేరిందని వివరించారు.  భారత్ మండపంలో జీ20 సమ్మిట్‌ను నిర్వహించబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సదస్సు ఇక్కడ ఏర్పాటు కానుంది. 

కాగా, ప్రగతి మైదాన్‌లో 123 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాలం చెల్లిన ఐటీపీఓ కాంప్లెక్స్‌ను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం రీడలప్ చేసింది. భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌గా తీర్దిదిద్దింది. మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు గమ్యస్థానంగా ఉండేలా రూ.2,700 కోట్లతో దీనిని రీడలప్ చేసినట్టు పీఎంఓ తెలిపింది. 
 
ఇందులో కన్వెన్షన్లు సెంటర్, ఎగ్జిబిషన్ హాల్స్, యాంఫిథియేటర్లు తదితర అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కీలక సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చేవిధంగా ”భారత్ మండపం” నిర్మాణం జరపాలనే మోదీ  ఆకాంక్షలకు అనుగుణంగా దీనిని నిర్మించినట్టు పీఎంఓ పేర్కొంది. ఐటీపీఓ కాంప్లెక్స్ ”భారత్ మండపం” ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, డాక్టర్ జితేంద్ర సింగ్, నటుడు అమీర్‌ఖాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.