ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సహా ఎపిలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి దగ్గరలో వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇదే సమయంలో భద్రాచలం వద్ద 48.10 అడుగుల నీటి మట్టం నమోదైంది అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది.
దిగువకు 12 లక్షల క్యూసెక్కుల వరకూ వరదనీటి ప్రవాహం ఉండటంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం కాటన్ బ్యారేజీ వద్ద 13.70 అడుగల నీటి మట్టం నమోదైంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. బ్యారేజీకి చెందిన 175 గేట్లను పైకి లేపి 12,63,605 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మున్నేరు, వైరా ఏరు, కట్లేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ – 65) పైకి వరద నీరు చేరింది. దీంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం సమీపంలో జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
విజయవాడ వైపు వచ్చే వాహనాలను ఐతవరం వద్ద, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను కీసర టోల్ గేట్ వద్ద నిలిపివేశారు. పోలీసు అధికారుల సూచన మేరకు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ సర్వీసులను గురువారం సాయంత్రం నుంచి అధికారులు ఆపేశారు. అత్యవసరమైతే ఖమ్మం మీదుగా సూర్యాపేట నుంచి ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. 2005 తర్వాత ఈ మార్గంలో అంతరాయం కలగడం ఇప్పుడే.
తొలుత ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరించి వాహనాల రాకపోకలను కొద్దిసేపు కొనసాగించారు. అయితే వరద ఉధృతి పెరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇక వత్సవాయి మండలం లింగాల, పెనుగంచిప్రోలు మండల కేంద్రం సమీపంలో మున్నేటి కాజ్ వేపై వరద నీరు ప్రవహిస్తొంది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయ కేశ ఖండన శాల వరకు వరద నీరు చేరుకుంది.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున మున్నేరు, వైరా ఏరు, కట్టలేరుకు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు కలిసి ఉధృతంగా ప్రవహిస్తూ కృష్ణానదిలో కలుస్తొంది. మున్నేటికి లక్షా 40వేలకుపైగా క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారెజ్ వద్దకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం అధికారులు లక్ష క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
మూడు రోజుల నుండి గంట గంటకు పెరుగుతూ వస్తున్న వరద ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. మ్యారేజి నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీల కు చేరుకోవడంతో అధికారులు ప్రస్తుతం 12 అడుగుల నీటిమట్టాన్ని ఉంచుతూ మిగులు జలాలని దిగువకు వదులుతున్నారు.
అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద శబరి నది 41.6 మీటర్ల నీటిమట్టం నమోదైంది. కొయుగురు వాగు పొంగి ప్రవహించటంతో రెండు రోజులుగా ఆంధ్ర – ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చట్టి వద్ద జాతీయ రహదారి – 30 పైకి వరద నీరు చేరడంతో భద్రాచలం – చింతూరు మధ్య రవాణా సౌకర్యం నిలిచిపోయింది. సోకులేరు వాగు పొంగి ప్రవహించడంతో చింతూరు – విఆర్.పురం మండలాల మధ్య సంబంధాలు తెగిపోయాయి
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు