వర్షాలకు ఉత్తర తెలంగాణ కకావికలం

బుధ, గురువారాల్లో కురిసిన వర్షాలకు ఉత్తర తెలంగాణ కకావికలమైంది. ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లక్ష్మీదేవిపేటలో 64.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. గత 27 ఏళ్లలో రాష్ట్రంలో ఓ చోట ఈస్థాయి వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. 

వరద బుధవారం అర్ధరాత్రి పూటభూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలోకి పోటెత్తడంతొ ఆ ఊరికి ఊరే నిండా మునిగింది. వరద నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు జనం ఇళ్లు, చెట్లపైకి ఎక్కి ప్రజలు ఆర్తనాదాలు చేశారు! ఓ నలుగురు వరదలో పడి గల్లంతయ్యారు! మరి.. ఆ ఊర్లో ఇంకెందరు వరదలో కొట్టుకుపోయారో? ఎవరు ఎక్కడ ఉన్నారో? అనేది వరదపోటు తగ్గాకే తెలిసే అవకాశం ఉంది! 

కిలోమీటర్ల మేర వరదే. ఆ గ్రామానికి వెళ్లేందుకు దారులే లేకపోవడంతో చివరికి సైనిక హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది.  మహబూబాబాద్‌, ములుగు, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది గల్లంతవ్వగా, ఏడుగురు మృతిచెందారు.

వర్షాలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా అతలాకుతలమైంది. పల్లెలు, పట్నాలు ముంపులో చిక్కుకున్నాయి. చెరువులు తెగిపోవడంతో మోరంచ గ్రామం పూర్తిగా మునిగిపోయింది. వర్షాలకు వరంగల్‌ జలదిగ్బంధమైంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నీట మునిగింది. వరదనీటిలో గద్దెలు మునిగిపోయాయి. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది.

వరద పోటు, తెగిన రోడ్లు, కూలిన విద్యుత్తు స్తంభాలు, చెట్లతో నగరంలో బీభత్స వాతావరణం నెలకొంది. వరంగల్‌- హనుమకొండ మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి మోకాలి లోతుకు మించి నీళ్లొచ్చాయి. బియ్యం ఇతర నిత్యావసరాలు తడిసిపోయాయి. 

బాధితులు తాగునీరు కూడా దొరక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ట్రాన్స్‌ఫార్మార్లు చెడిపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో మంచినీటి సరఫరా జరగడం లేదు. వరంగల్‌-హనుమకొండలో లోతట్టు ప్రాంతాల్లోని 35-40 కాలనీల్లో వరద నీరు ముంచెత్తింది.  ముంపు బాధితుల కోసం ప్రత్యేకంగా 30కి పైగా సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. బాధితులను మరపడవల ద్వారా 40 పునరావాస కేంద్రాలకు తరలించారు. 

వర్షాలు ఖమ్మం జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మున్నేరు వాగు మునుపెన్నడూ లేని విధంగా 30 అడుగుల ఎత్తులో పొంగిపొర్లుతుండటంతో ఖమ్మం నగరంలో కొన్ని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ముంపు కాలనీల్లోని 2వేల మంది బాధితులను నాటు పడవల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు.

వరద నీరు చుట్టు ముట్టడంతో ఖమ్మం నగరంలో ఇళ్లలోకి పాములు వస్తుండటటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పట్టణంలోని ఎఫ్‌సీఐ గోదాం వద్ద భారీ కొండచిలువను రెస్క్యూటీం పట్టుకొని సుదూర ప్రాంతంలో వదిలివేశారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల -రాఘవరెడ్డి పేట మధ్య బిడ్జి కూలిపోయింది. దీంతో తొమ్మిది గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.

భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే బుధ, గురువారాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది. సహాయం కోసం 18004251980, 9701999645 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. 7999100300 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చని సూచించింది.

కాగా, హైదరాబాద్‌లో వాన మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం  తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది. నగర వ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. నేడు హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కుసే అవకాశాలున్నాయి.
 
బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ పరిసరాల్లో కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ కే నాగరత్న తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని చెప్పారు. దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.