ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3  నుంచి నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికల వేళ కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. శాసనసభ సమావేశాల నిర్వహ‌ణ తేదీల ఖరారుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో అందుబాటులో ఉన్న పలువురు మంత్రులతో సమావేశమై చర్చించినట్లు తెలుస్తున్నది. 

మరోవైపు జులై 31న మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్‌ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వరదలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు సుమారు 50 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 12వతేదీతో ముగిశాయి. ఈ సమావేశాలు పూర్తయిన ఆరు నెలలలోపు అంటే ఆగస్టు 11లోపు ఉభయసభలను సమావేశ పరచాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 3న అసెంబ్లి, శాసనమండలిని సమావేశ పరచాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించినట్టు సమాచారం. 

కీలకమైన ఆరేడు బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర కీలక అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.  నవంబర్‌ లేదా డిసెంబర్‌ లో తెలంగాణ అసెంబ్లి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలను తమకు అనుకూలంగా మలుచుకుని విపక్ష పార్టీలను ఇరుకున పెట్టె ప్రయత్నం చేసే అవకాశం ఉంది. 

ఉచిత విద్యుత్‌ ఫ్రై తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశాల్లో ప్రస్తావనకు తీసుకువచ్చి కాంగ్రెస్‌ పార్టీని తూర్పార బట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు చెబుతుతున్నారు. ఈ  అంశంపై సీఎం కేసీఆర్‌ శాసనసభలో పవర్‌ పాయుంటి ప్రెజెంటేషన్‌ ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెట్టె సూచనలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లి ఎన్నికలు సమీపిస్తుండడంతో శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్‌ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, అసెంబ్లి, శాసనమండలి సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు సమావేశాల ఎజెండా, ఏయే బిల్లులను సభ ముందుకు తీసుకు రావాలన్న అంశంపై చర్చించేందుకు మంత్రి మండలిని జులై 31న సమావేశ పరచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు సమాచారం. మంత్రివర్గ సమావేశానికి సంబందించిన ఎజెండాను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించినట్టు తెలుస్తోంది.