ఉధృతంగా గోదావరి.. భద్రాచలంలో రెండో హెచ్చరిక జారీ

తెలంగాణలో వర్షాలు దంచి కొడుతుండటంతో వరద ప్రవాహం నదుల్లోకి ముంచెత్తుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు గోదావరి ఉగ్రరూపం అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50అడుగులు దాటింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 
 
 ఈ నెల 20వ తేదీ నుంచి గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటి మట్టం గంటగంటకు పెరుగుతోంది. తాలిపేరు ప్రాజెక్టు 25గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.గోదావరి ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. బుధవారం జిల్లలోని ములకలపల్లి మండలం, చాపరాలపల్లి వద్ద కుమ్మరివాగు ఉధృతంగా ప్రహిస్తుంది. ఈ క్రమంలో కొంతమంది మహిళలు వాగు దాటుతుండగా.. వారిలో ఓ మహిళ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
రాష్ట్రంలో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరో 48 గంటలపాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. వర్షాలపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్‌ బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
 
భారీ వర్షాల నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్‌ సైతం పోలీస్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో బుధవారం రాత్రి డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, ఈ జలాశయాల వద్దకు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్న తెలిపారు. జూన్‌ 1 నుంచి బుధవారం నాటికి 313.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 416.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు చెప్పారు.  మరో వారంపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో మరింత అధిక వర్షపాతం రికార్డు అయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించారు.