మణిపూర్ వీడియో లీకేజ్ వెనుక కుట్ర

దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలకు కారణమైన మణిపూర్ మహిళల నగ్న వీడియో వెనుక కుట్ర ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఈ వీడియోను విడుదల చేసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. 

మణిపూర్ హింసాత్మక ఘర్షణలకు సంబంధించిన ఏడు కేసుల దర్యాప్తు బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనకు సంబంధించిన కేసు కూడా దీనిలో ఉన్నట్టు వివరించింది. ఈ కేసుల విచారణను వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరింది.

1990వ దశకం నుంచి ఇప్పటి వరకు మణిపూర్‌లో కుకీ-మెయిటీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల గురించి మీడియాకు అమిత్ షా తెలిపారు. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనను వీడియో చిత్రీకరించిన వ్యక్తిని అరెస్ట్ చేసి, దీనిని చిత్రీకరించేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

ప్రాథమికంగా చూసినపుడు ఈ వీడియోను విడుదల చేయడం వెనుక కుట్ర కనిపిస్తోందని పెర్కోన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముందు దీనిని విడుదల చేసి, తద్వారా మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే కుట్ర కనిపిస్తోందని ఆరోపించారు. మరో రెండు వీడియోలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. 

మణిపూర్‌లో పరిస్థితిని మరింత తీవ్రంగా రెచ్చగొట్టడం కోసం ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోలలో చూపిన సంఘటనలు 2022లో మయన్మార్‌లో జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ఆరు కేసులను ఇప్పటికే సీబీఐకి అప్పగించామని, మరొకదానిని అప్పగించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. నిష్పాక్షికత కోసం ఈ కేసుల విచారణ వేరొక రాష్ట్రంలో జరగాలని సుప్రీంకోర్టును కోరినట్లు తెలిపారు. మరికొన్ని కేసుల దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించినట్లు తెలిపారు.