బీ-టీమ్‌లు కాదు ఏ-బీ-సీ టీమ్‌లు

బిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక పార్టీకి మరో పార్టీ బీ-టీమ్‌లా కాకుండా ఈ మూడు పార్టీలు ఏ-టీమ్, బీ-టీమ్, సీ-టీమ్ అన్న రీతిలో పనిచేస్తున్నాయని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు. ఎంఐఎం చేతిలో బీఆర్ఎస్ స్టీరింగ్ ఉందని. అలాగే బీఆర్ఎస్ చేతిలో కాంగ్రెస్ స్టీరింగ్ ఉందని ఎద్దేవా చేశారు. మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని మండిపడ్డారు.

కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీఆరెస్ జైకొట్టడంతో కాంగ్రెస్- బీఆరెస్ దొంగతనం బయటపడిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం నోటీసులపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేయడం ద్వారా మూడు పార్టీల లాలూచీ బయటపడుతోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌లో చేరకుండా కేసిఆర్ తెలంగాణ పేదలకు రూ. 35 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లేలా చేశారని, బడ్జెట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ. 30 వేల కోట్లు కేటాయించి 3 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని ఆయన ఆరోపించారు.

పైసలన్నీ కాళేశ్వరంలో ముంచుడు కవితకు ఇచ్చుడు అన్నట్లు కేసిఆర్ వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లలో పంట నష్టానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెబుతూ రోజుకు 18 గంటలు పనిచేసే ప్రధాని మోదీపై ఫార్మ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ అవిశ్వాసం పెట్టారని ధ్వజమెత్తారు. 

కడెం ప్రాజెక్టు గతేడాది ఏ స్టేజిలో ఉందో ఇప్పుడు అలాగే ఉందని పేర్కొంటూ ఇన్ని రోజులు కేసిఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని అరవింద్ నిలదీశారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు రోడ్ కాంట్రాక్టులు ఇవ్వడం వల్లనే నాసిరకం రోడ్లు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు.

రైలు ప్రమాదం జరిగితే ప్రధాని సందర్శించారని, రైల్వే శాఖ మంత్రి మరమ్మత్తు పనులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి రైలు ప్రయాణాలు మొదలైయ్యాక తిరిగొచ్చారని గుర్తుచేశారు. కానీ వర్షాలతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఫార్మ్ హౌస్ వీడి బయటకు రావడం లేదని దయ్యబట్టారు.

 పేదలకు మంచి చేసినందుకేనా ప్రధానిపై అవిశ్వాసం పెట్టారా? అని ప్రశ్నించారు. ప్రపంచ దేశాల్లో భారత్ ఇమేజ్ పెంచినందుకా? అని నిలదీశారు. కేసిఆర్ కు వ్యతిరేకంగా పనిచేసేవాళ్లకు కాంగ్రెస్ లో పదవులు ఇవ్వడంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ‘ఇండియా’ కూటమిని ప్రస్తావిస్తూ ‘ఇటలీ’ కూటమి అని పేరు పెట్టి ఉంటే ఖర్గే శాశ్వతంగా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉంటారని ఎద్దేవా చేశారు.