మోదీ ప్రభుత్వంపై `ఇండియా’ అవిశ్వాస తీర్మానం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనబోతోంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన ఈ తీర్మానానికి లోక్ సభ సభాపతి ఓం బిర్లా బుధవారం ఆమోదం తెలిపారు. దీనిపై చర్చకు తేదీని త్వరలోనే ఖరారు చేయబోతున్నారు. 26 పార్టీల కూటమి ఇండియాలో లేని పార్టీ బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.

ఓం బిర్లా మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని అనుమతిస్తున్నట్లు తెలిపారు. దీనిపై చర్చ కోసం తగిన తేదీని నిర్ణయించేందుకు అన్ని పార్టీల నేతలతో చర్చిస్తానని చెప్పారు. దీనిపై చర్చించే తేదీని సభ్యులందరికీ తెలియజేస్తానని చెప్పారు. మణిపూర్ లో కొనసాగుతున్న తీవ్రమైన హింసపై ప్రధాని మోదీ స్పందించాలని, పార్లమెంటులో సమగ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష కూటమి ‘ఇండియా’ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనివ్వండి, ప్రభుత్వం ఏ పరిస్థితికైనా సిద్దంగా ఉంది అని చెప్పారు. మణిపూర్ సమస్యపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకమునుపు ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయని, చర్చకు ప్రభుత్వం అంగీకరించేసరికి, వారు నిబంధనల సమస్యను లేవనెత్తారని దుయ్యబట్టారు. 

నిబంధనలపై కూడా తాము అంగీకారానికి వచ్చామని, ఆ తర్వాత వారు ప్రధాన మంత్రి రావాలని, చర్చను ప్రారంభించాలని కొత్త అంశాన్ని లేవనెత్తారని మండిపడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ, బీజేపీ, ప్రధాని మోదీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని చెప్పారు. గతంలో కూడా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయని, వారికి ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రతిపక్ష కూటమి ఇండియా నేతలు తాము గతంలో చేసిన పనులను ప్రజల మనసుల నుంచి చెరిపేయలేరని చెప్పారు. పేరు మార్చుకోవడం ద్వారా తమ గతాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని, ఆ కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని భరోసా వ్యక్తం చేశారు.

బీఎస్‌పీ ఎంపీ మలూక్ నగర్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వ లేమి ఉందని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి, ప్రభుత్వం బలహీనంగా ఉన్నపుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే ఎంపీల సంఖ్య చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని, ప్రధాన మంత్రి ఆ తర్వాత వస్తారని, ఈ అభిప్రాయాలన్నిటికీ సమాధానాలు చెబుతారని, అప్పుడు ప్రతిపక్షాలు బలహీనపడతాయని హెచ్చరించారు. ప్రతిపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానం గురించి కనీసం ఆలోచించి ఉండవలసింది కాదని పేర్కొన్నారు.

వైసిపిఎంపీ విజయసాయి రెడ్డి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, అంతా సజావుగా జరుగుతున్నపుడు అవిశ్వాస తీర్మానం అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు.