ఐదేళ్ల ముందే ఊహించిన ప్రధాని మోదీ

విపక్షాలు ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఐదేళ్ల క్రితం నాటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. 2023లో విపక్షాలు తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకువస్తారని 2018లొనే ప్రధాని నరేంద్ర మోదీ ఆ వీడియోలో చెప్పారు. 2018 లో ఇలాగే, లోక్ సభ ఎన్నికల ముందు విపక్షం నాటి మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ అవిశ్వాస తీర్మానం భారీ తేడాతో వీగిపోయింది.

అది 2019 ఫిబ్రవరి 7వ తేదీ. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, విపక్ష పార్టీలు 2023లో మరో అవిశ్వాస తీర్మానానికి సిద్ధం చేసుకోవచ్చునని సూచించారు. ఏడాది క్రితమే విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తమ ప్రభుత్వం ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 

”2023లో మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చే అవకాశం మీకు వస్తుంది. మీకు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను” అని మోదీ లోక్‌సభలో అనగానే, అధికార సభ్యులు నవ్వులు చిందిస్తూ గట్టిగా బల్లలు చరిచారు. సమర్పణ భావం (సేవాభావం)తో ఇద్దరు ఎంపీల నుంచి ఇప్పుడు ఈ స్థాయికి (అధికార హోదా) వచ్చామని, అహంకార భావంతో 400 మంది ఎంపీలున్న వారు 40 సభ్యులకు కుదించుకుపోయారని పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీకి చురకలు వేశారు. 

మోదీ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ నేతలతో సహా సోనియాగాంధీ కూడా సభలోనే ఉన్నారు. అంటే, 2019 ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని నర్మగర్భంగా, పరోక్షంగా విపక్షానికి ప్రధాని మోదీ చెప్పారు. ఆయన ఊహించినట్లే.. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చింది. 

ఆయన ఊహించినట్లే.. విపక్షం మళ్లీ 2023 లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చింది. దాంతో, 2023 లో తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వస్తుందంటూ 2018 లోనే ఊహిస్తూ.. ప్రధాని మోదీ చేసిన ప్రసంగం వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 2018 లో నాటి మోదీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి దాదాపు అన్ని విపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. కానీ, 314 ఓట్లు సాధించి, ఆ తీర్మానాన్ని ప్రభుత్వ పక్షం ఓడించింది.