ఓపెన్హైమర్ కు భారత పౌరసత్వం ఇవ్వజూపిన నెహ్రు!

అణుబాంబు సృష్టించడం ద్వారా ప్రపంచ చరిత్ర గతినే మార్చివేసిన అమెరికా ఫిజిసిస్ట్, ది ఫాధర్ ఆఫ్ అటామిక్ బాంబ్గా పిలిచే రాబర్ట్ ఓపెన్హైమర్ కు భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఒకానొక సందర్భంలో భారత పౌరసత్వం ఇవ్వజూపారు. ఆ మేరకు ఆయనకు ఓ రహస్య లేఖ వ్రాసారు.
 
ఓపెన్హైమర్కు భారత దేశం అన్నా, ఇక్కడి సంప్రదాయాలన్నా చాలా ఇష్టం. ఆయన సంస్కృతం నేర్చుకున్నారు. భగవద్గీత కూడా చదివారు. ఈ క్రమంలోనే భారత దేశం అణుశక్తిగల దేశంగా మారేందుకు పునాదులు వేసి “ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్” గా పేరొందిన న హోమి జహంగీర్  భాభాకు ఓపెన్హైమర్కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత భాభాపై ఆయనకు ఇష్టం పెరిగింది.
 
బాబాపై భక్తీయర్ కే దాదాభోయ్ రాసిన 723 పేజీల జీవిత కథ గత ఏప్రిల్లో విడులైంది. ఈ పుస్తకంలోనే హోమి జహంగీర్కు ఓపెన్హైమర్కు మధ్య ఉన్న బంధాన్ని రచయిత తెలిపారు. భాభా సిఫార్సుతో నెహ్రూ.. ఓపెన్హైమర్కు భారత పౌరసత్వాన్ని ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ఆయనకు ఓ లేఖ రాశారని సమాచారం.
 
తాజాగా విడుదలైన “ఓపెన్హైమర్” హాలీవుడ్ సినిమా ఇప్పుడొక సంచలనంగా మారింది. రాబర్ట్ ఓపెన్హైమర్ జీవిత కథ ఆధారంగా.. దిగ్గజ దర్శకుడు క్రిస్టఫర్ నోలాన్ రూపొందించిన ఈ చిత్రం వసూళ్ల పరంగా దూసుకెళుతోంది. ఈ సందర్భంగా నెహ్రు ఆయనకు వ్రాసిన `రహస్య లేఖ’ వెలుగులోకి వచ్చింది.

తాను రూపొందించిన అణుబాంబును చూసి ఓపెన్హైమర్ తొలుత సంతోషించారు. కానీ రెండో ప్రపంచ యుద్ధం అనంతరం హీరోషిమా, నాగాసాకి దుస్థితిని చూసి బాధపడ్డారు. అప్పటి నుంచి అణ్వాయుధాలకు వ్యతిరేకంగా కొంతకాలం పోరాటం చేశారు. ముఖ్యంగా 1954లో టెస్టింగ్ దశలో ఉన్న హైడ్రోజెన్ బాంబు తయారీని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో అమెరికా అధికారులు ఓపెన్హైమర్పై దృష్టి సారించి ఒకప్పుడు గౌరవంగా చూసుకున్న వారే, ఆ తర్వాత ఆయన్ని తీవ్ర భంగపాటుకు గురిచేశారు. ఫిజిసిస్ట్కు, ఆయన భార్యకు కమ్యూనిష్ట్లతో బంధం ఉందని నిందలు మోపారు. ఆయన సెక్యూరిటీని కూడా తొలగించారు. విధానాల తయారీ కమిటీల నుంచి బహిష్కరించారు.

ఈ సమయంలోనే ఓపెన్హైమర్కు నెహ్రూ ఓ రహస్య లేఖ రాసినట్టు ప్రస్తుత పుస్తకంలో ఉంది. “భారత్ లో పర్యటించండి. అవసరమైతే భారత్ కు వలస వచ్చేయండి. భారత పౌరసత్వాన్ని ఇస్తాము,” అని ఆ లేఖలో నెహ్రూ పేర్కొన్నట్టు సమాచారం. అయితే ఈ లేఖను ఓపెన్హైమర్ సీరియస్గా తీసుకోలేదని తెలుస్తోంది. అమెరికాపై ఆయనకు ఉన్న దేశభక్తి ఇందుకు కారణం.

మరోవైపు భారత్ లో ఓపెన్హైమర్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఓ సెక్స్ సీన్లో భగవద్గీత పుస్తకం కనిపించడమే ఇందుకు కారణం. ఈ సీన్ను తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీనిని వెంటనే తొలిగించాలని భారత కేంద్ర సమాచార శాఖ కమిషనర్ ఉదయ్ మహూర్కర్ డిమాండ్ చేశారు. లేకపోతే తగు విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 
 
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సహితం స్పందిస్తూ భగవద్గీత భారతీయలకే కాకుండా ప్రపంచవ్యాప్త ప్రజలకు పవిత్ర ఆదర్శ గ్రంథం అని, కామకేళి ఘట్టాల నడుమ దీనిని ప్రదర్శించడం అనుచితం అని పేర్కొన్నారు. ఈ దృశ్యం తొలగించాల్సిందే అని స్పష్టం చేశారు.