విపక్ష నేతలకు అమిత్ షా లేఖలు

మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు ఎంత సేపు కావాలంటే అంతసేపు చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనిపేర్కొంటూ తాను లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలకు లేఖలు రాసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మణిపూర్ అంశంపై మంగళవారం కూడా పార్లమెంటు ఉభయ సభలో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కటిగిన విషయం తెలిసిందే. 

ప్రతిపక్షాల గొడవ మధ్యలోనే లోక్‌సభలో బహుళ రాష్ట్ర సహకార సంఘాల సవరణ బిల్లుపై జరిగిన స్వల్పకాలిక చర్చకు అమిత్ షా సమాధానమిస్తూ మణిపూర్ అంశంపై దాచి పెట్టడానికి ఏమీ లేదని, దీనిపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

‘నినాదాలుచేస్తున్న వారికి సహకారంపై కానీ, సహకార సంఘాలపైన కానీ, దళితులపైన కానీ మహిళల సంక్షేమం కానీ ఆసక్తి లేదు. మణిపూర్ అంశంపై మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉభయ సభల ప్రతిపక్షాల నేతలకు నేను లేఖలు రాసానని మరోసారి స్పష్టం చేయదలిచాను’ అని తెలిపారు.

”మాకు ఏ విషయం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మేము ఎన్నికలకు సైతం వెళ్తాం. ప్రజలు మిమ్మల్ని గమన్నిస్తున్నారు. మణిపూర్‌ వంటి సున్నిత అంశంపై చర్చకు అనువైన వాతావరణాన్ని కల్పించండి” అని విపక్షాలను ఉద్దేశించి హోం మంత్రి హితవు చెప్పారు. అనంతరం సభ మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది.

లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్లగేకు రాసిన లేఖను ట్విట్టర్‌లో అమిత్‌షా షేర్ చేశారు. మణిపూర్ అంశంపై చర్చ సజావుగా జరిగేందుకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆ ట్వీట్‌లో కోరారు. మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రధాన మంత్రి మాట్లాడాలని పట్టుబడుతున్న విపక్ష పార్టీలు ఇదే విషయమై మోదీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్తల నేపథ్యంలో విపక్ష నేతలకు అమిత్‌షా లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.