ఇండియన్ ముజాహిదీన్ లో కూడా ‘ఇండియా’ ఉంది

కొత్తగా ఏర్పడిన విపక్ష కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. కూటమి పేరులో `ఇండియా’ అని పెట్టుకుని ప్రజలను మోసం చేయలేరని విపక్ష నేతలపై మండిపడ్డారు. కూటమి పేరులో `ఇండియా’ అని ఉన్నంత మాత్రాన ప్రజలు మోసపోరని, ప్రతిపక్షం అసలు రూపం ప్రజలకు తెలుసని ధ్వజమెత్తారు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ మంగళవారం మాట్లాడుతూ భారత్ ను నాశనం చేసిన కంపెనీలు, దేశంలో విధ్వంసం సృష్టించడం కోసం రూపొందిన ఉగ్రవాద సంస్థల పేర్లలో కూడా `ఇండియా’ అని ఉంటుందని ప్రధాని గుర్తు చేశారు. భారత్ ను వలస పాలనలోకి తీసుకువెళ్లిన ఈస్ట్ ఇండియా కంపెనీ, ఉగ్రవాద సంస్థలు ఇండియన్ ముజాహిదీన్, పీఎఫ్ఐ పేర్లలో కూడా ‘ఇండియా’ ఉంటుందని చెప్పారు. 

స్వాతంత్య్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరుతో ఏఓ హ్యూమ్ అనే బ్రిటిష్ వ్యక్తే స్థాపించాడని ప్రధాని మోదీ తెలిపారు.  వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావడంపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ నాయకులు చర్చించారు.

దేశంలో ప్రతిపక్షం దశ, దిశ లేకుండా ఉందని ప్రధాని మోదీ విమర్శించారు. సైద్ధాంతిక వైరుద్ధ్యాలన్న నాయకులు, రాష్ట్రాల్లో పరస్పరం ప్రత్యర్థులుగా ఉన్న నాయకులు కలిసి `ఇండియా’ అనే పేరుతో కూటమి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. ప్రతిపక్షం నిస్పృహలో ఉందని పేర్కొన్నారు.  ఓటమి, నిరాశ, నిస్సహాయంతో అలసిపోయిన ప్రతిపక్షాలకు మోదీని వ్యతిరేకించటం ఒకటే ఎజెండా పెట్టుకున్నాయని అభివర్ణించారు

2024లో ఎన్డీయే దే మళ్లీ విజయమని, వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్షం శాశ్వతంగా ప్రతిపక్షంలోనే ఉంటుందని చెబుతూ అందుకు ప్రతిపక్షం కూడా సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వంలో దేశంలో నవోదయం సాధ్యమైందని, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట ఇనుమడించిందని ప్రధాని మోదీ తెలిపారు.

కాగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని వాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ ”మోదీజీ…మీరు మమ్మల్ని ఏవిధంగానైనా పిలవండి… ఉయ్ ఆర్ ఇండియా” అంటూ ట్వీట్ చేశారు.

మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం!

ఇలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి `ఇండియా’ నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రసంగించాలనే డిమాండ్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

ఇండియా కూటమి పార్టీల సమావేశంలో అవిశ్వాస తీర్మానం అంశంపై చర్చించారు. మణిపూర్ హింసపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఇండియా డిమాండ్ చేస్తోందని పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  ట్వీట్ చేశారు. ఖర్గే  ఛాంబర్‌లో జరిగిన ఇండియా కూటమి సమావేశలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే మార్గాలపై చర్చించారు. అవిశ్వాస తీర్మానం ద్వారా మణిపూర్ హింస సహా అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని విపక్ష నేతలు భావిస్తున్నారు.

‘‘ 83 రోజులుగా ఏమాత్రం తగ్గుదల లేని మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో సమగ్రమైన ప్రకటన చేయాల్సి ఉంది. భయానక హింసకు సంబంధించిన కథనాలు నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి. మణిపూర్ హింసపై మోదీ ప్రభుత్వం సమాధానానికి `ఇండియా’ డిమాండ్ చేస్తోంది”.

“ఈశాన్య భరతంలో పరిస్థితులు చాలా సున్నితంగా మారాయి. మణిపూర్ హింసాత్మక పర్యవసనాలు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించేలా కనిపిస్తున్నాయి. సరిహద్దులను పంచుకునే సున్నితాత్మాక రాష్ట్రాలకు ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రధాని మోదీ అహాన్ని పక్కనపెట్టి.. దేశానికి మణిపూర్‌‌పై నమ్మకం కల్పించాలి’’ అని మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు.