డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకై బిజెపి రాష్ట్ర వ్యాప్త ధర్నా 

పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా బిజెపి ధర్నా నిర్వహించింది. ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం బిజెపి శ్రేణులు ధర్నా చేపట్టారు. 

ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు 30లోగా నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని కేటాయించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రకటించారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి నిరుపేదలని పంపిస్తామని హెచ్చరించారు.

గద్వాల్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ, నల్గొండలో మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ హనుమకొండ జిల్లాలో, జితేందర్‌రెడ్డి నారాయణపేట్ లో, వరంగల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఖమ్మంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి, కామారెడ్డిలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జనగాంలో వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో గుజ్జుల ప్రేమేందర్ రెడి పాల్గొన్నారు.

బిజెపి మహాధర్నా వాయిదా
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద మంగళవారం బిజెపి తలపెట్టిన మహాధర్నా వాయిదా వేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ తెలిపారు. మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో ఈ మహాధర్నాను వాయిదా వేసినట్లు తెలిపారు. 
 
ఈ మహాధర్నాను నిర్వహించడం కోసం నిర్ణయించాల్సిన తేదీని అతి త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాకు బీజేపీ అనుమతి కోరగా, పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో ఆ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ధర్నా చేసుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
ధ‌ర్నా చౌక్ ప్రాంతంలో ఫ్లై ఓవ‌ర్ ప‌నులు జ‌రుగుతుండ‌టం వ‌ల్ల అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య కూడా ఉంద‌ని వెల్లడించారు.. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతిభద్రతలకు విఘాతం కలగలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతిభద్రతలు గుర్తుకు రాలేదా? అడిగింది. 
 
ప్రభుత్వం కనీసం 500 మందికి కూడా భద్రత కల్పించకపోతే ఎలా? అని కూడా ప్రశ్నించింది. ఆ తర్వాత బీజేపీ మహా ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ధర్నాలో 500 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని పేర్కొంది. పోలీసుల‌కు నిర్వ‌హ‌కులు స‌హక‌రించాల‌ని సూచించింది.