`రెడ్ బుక్’లో అశోక్‌ గెహ్లాట్‌ అవినీతి చిట్టా!

కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు బజారుకెక్కుతున్నాయి. సొంత మంత్రులే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ రచ్చకెక్కుతున్నారు. ప్రభుత్వ అవినీతిపై ఇదివరకే అసమ్మతి నేత సచిన్‌ పైలట్‌ రాష్ట్రమంతా తిరిగి నిరసన తెలుపగా, తాజాగా ఓ మంత్రి సైతం సొంత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసి పదవిని కోల్పోయారు. 
 
ఆయన అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అవినీతి చిట్టాను సోమవారం అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేసేందుకు ప్రయత్నించడం ద్వారా రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టించారు.  రాజేంద్రసింగ్‌ గుడాను అసెంబ్లీలో అడ్డుకొనేందుకు కాంగ్రెస్‌ సభ్యులు సోమవారం హైడ్రామా సృష్టించారు. రాజస్థాన్ అశోక్‌ గెహ్లాట్‌ అవినీతి చిట్టాను సోమవారం అసెంబ్లీ  వేదికగా బట్టబయలు చేసేందుకు రెండు రోజుల క్రితం ఆయన మంత్రివర్గం నుండి బహిష్కరణకు గురైన  రాజేంద్రసింగ్‌ గుడా ముఖ్యమంత్రి అవినీతి చిట్టా అంటూ రాజేంద్రసింగ్‌ సభకు ఒక ఎరుపు రంగు డైరీని తీసుకొచ్చారు. 

సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అక్రమ ఆర్థిక లావాదేవీలు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలకు చేసిన డబ్బు పంపిణీ వివరాలు అందులో ఉన్నాయని ఆయన ఆరోపించారు. అయితే ఈ రెడ్‌ డైరీ అంశాన్ని ప్రస్తావించగానే సభలో గందరగోళం నెలకొన్నది. రాజేంద్రసింగ్‌తో ఇతర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు. 

రెడ్‌ డైరీ రహస్యాలను సభకు వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆయన వెల్‌లోకి దూసుకెళ్లారు. అయితే మాట్లాడేందుకు స్పీకర్‌ అనుమతించలేదని, మంత్రి శాంతికుమార్‌ ధరివాల్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తనను ‘కొట్టి, తన్ని, అసెంబ్లీ నుంచి బయటకు లాగిపడేశారు’ అని రాజేంద్ర సింగ్‌ ఆ తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు.

 ఈ సందర్భంగా అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వంపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళలపై నేరాల్లో దేశంలోనే రాజస్థాన్‌ మొదటి స్థానంలో ఉందని మరోసారి ఆరోపించారు. రాజస్థాన్‌ కూతుర్లు, సోదరీమణులు తనను విధాన సభకు పంపించారని, మహిళల రక్షణకు పాటుపడటానని తనకు ఓట్లువేసి గెలిపించారని చెప్పారు.

సస్పెండ్‌ అయిన అనంతరం రాజేంద్రసింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘దాదాపు 50 మంది నాపై దాడి చేశారు, కొట్టారు, తన్నారు. కాంగ్రెస్‌ నేతలు సభ నుంచి నన్ను బయటకు లాగిపడేశారు. రెడ్‌ డైరీ వివరాలు సభకు చెప్పాలని అనుకొన్నాను. మాట్లాడేందుకు కూడా స్పీకర్‌ అవకాశం ఇవ్వలేదు’ అంటూ మండిపడ్డారు.

 ‘నేను చేసిన తప్పేంటి?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్న అంశాన్ని ప్రస్తావించానని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శాంతికుమార్‌ ధరివాల్‌ వద్దకు వెళ్లి, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరాను. అందుకు అనుమతించని స్పీకర్‌ చాంబర్‌కు రావాలని పదేపదే చెప్పారు. అనంతరం మంత్రితో పాటు ఎమ్మెల్యేలు చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. తీవ్రంగా కొట్టారు. డైరీలోని కొన్ని పేజీలను చించుకొని పోయారు’ అని వివరించారు.

రాజస్థాన్‌ మొగోళ్ల రాష్ట్రమని ఏకంగా క్యాబినెట్‌ మంత్రి శాంతి కుమార్‌ ధరివాల్‌ ప్రకటించినప్పుడు తప్పులేనిది మహిళ భద్రత గురించి తాను మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని మాజీ మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయని రాజేంద్రసింగ్‌ అసెంబ్లీలో పేర్కొనడంతో గత వారం గంటల వ్యవధిలోనే ఆయనను సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు.