మణిపూర్‌కు గూడ్స్‌రైలు పునరుద్ధరణ

మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన గూడ్సు రైల్వే సేవలను సోమవారం పునరుద్దరించారు. గువాహటి నుంచి తమెంగ్‌లాంగ్ జిల్లా ఖోంగ్సాంగ్‌కు నిత్యావసరాలు, ఆహార ధాన్యాలు తీసుకొచ్చిన రైలుకు ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ తన మంత్రివర్గ సహచరులు, సీనియర్ అధికారులతో కలిసి స్వాగతం పలికారు. 

మే 3 న ఘర్షణలు చోటు చేసుకున్న తర్వాత తొలిసారి ఆయన ఆదివాసీల ప్రాబల్యం ఉన్న జిల్లాలోకి అడుగుపెట్టారు. మే 5 నుంచి ఈ రాష్ట్రంలో రైల్వేసేవలు నిలిచిపోయాయి. ‘ఈరోజు ఖోంగ్సాంగ్ రైల్వేస్టేషన్‌లో గూడ్స్ రైలు రాకను చూడడం ఆనందంగా ఉంది. ఈ పరిణామం మణిపూర్ ప్రజలకు అనేక అవకాశాలు రాబోతున్నాయని సూచిస్తోంది’ అబూ చెప్పారు. 

`నిత్యావసర వస్తువులు, వేగవంతమైన రవాణా, సాధ్యపడనుంది. ఇలాంటి రవాణాతో పారిశ్రామిక వృద్ధి పరుగులు పెడుతుంది . ఈ చొరవతో రాష్ట్ర ఆర్థిక అవకాశాలను పురోగమించడంలో కీలక పాత్ర పోషించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు’ అని సిఎం బీరేన్‌సింగ్ ట్వీట్ చేశారు. త్వరలో మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు, పశ్చిమ బెంగాల్ నుంచి బంగాళా దుంపలు, అస్సాం నుంచి నిత్యావసరాలు సరఫరా కానున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.

కాగా, మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేయగా.. తాజాగా ఏడో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఇలా ఉండగా, కేంద్ర మంత్రి ఆర్కే రంజన్‌ సింగ్‌ ఇంటిపై నిరసనకారులు మరోసారి దాడికి దిగారు. ఇంఫాల్‌లో మణిపూర్‌ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించగా మంత్రి నివాసం వద్దకు ర్యాలీ చేరుకోగానే కొంతమంది ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలని కోరుతూ ఛత్తీస్‌గఢ్‌లో సర్వ ఆదివాసీ సమాజ్‌ బంద్‌ పాటించింది.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు రోజులుగా స్తంభిస్తున్నాయి. మణిపూర్ మంటలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు సోమవారం రాత్రి పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన కొనసాగించారు.