ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 నుంచి ఇప్పటి వరకు వనమా ఎమ్మెల్యే పదవీకాలం చెల్లదని స్పష్టం చేసింది.  ఎన్నికల అఫిడవిట్ లో వనమా తప్పుడు వివరాలను ఇచ్చారంటూ 2018లో హైకోర్టును జలగం వెంకట్రావు ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు వనమాకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వనమా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. జలగం వెంకట్రావు బిఆర్ఎస్ నుండి బరిలోకి దిగారు. ఇక ఇప్పడు ఆయనే ఎమ్మెల్యే అయ్యారు.

ప్రజాప్రాతినిథ్య చట్టం నిబంధనల ప్రకారం వనమా వెంకటేశ్వరరావు పై ఐదేళ్ల అనర్హత కూడా వర్తిస్తుందని జలగం తరపు న్యాయవాది రమేష్ తెలిపారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు బిఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్‌ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా కోర్టు అనర్హత వేటు పడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

కొద్ది నెలల క్రితం వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ ఓ కుటుంబాన్ని వేధించిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మీ-సేవ నిర్వాహకుడిగా ఉన్న వ్యక్తికి తన సోదరి, తల్లితో ఉన్న ఆస్తి గొడవలు సెటిల్ చేయడానికి అతని భార్యను తన వద్దకు పంపమని చెప్పాడు. సదరు బాధితుడు ఈ విషయాన్ని స్వయంగా వీడియో రికార్డు చేసి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో పరారీలో ఉన్న రాఘవను తీవ్రంగా గాలించి అరెస్టు చేసి జైలుకు పంపారు.ఆ తర్వాత వనమా రాఘవకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.