మయన్మార్ నుంచి 718 మంది మణిపూర్‌కు చొరబాటు

మయన్మార్ నుంచి 718 మంది మణిపూర్‌కు చొరబాటు
రెండు తెగల మధ్య నెలకొన్న ఘర్షణలతో మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లు, అందులో భాగంగా జరుగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి సృష్టిస్తున్న వేళ మరో భయంకరమైన నిజం బయటికి వచ్చింది. ఇప్పటికే ఈ అల్లర్లు, హింస వెనుక విదేశాల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ చొరబాట్లు చోటుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
రెండు రోజుల్లోనే పొరుగున ఉన్న మయన్మార్ నుంచి 718 మందికిపైగా మణిపూర్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం మణిపూర్ ప్రభుత్వంకు మరింత ఆందోళనకు గురిచేస్తోంది.  మణిపుర్‌లో దాదాపు 3 నెలలుగా మెజారిటీలుగా ఉన్న మెయితీలు, మైనారిటీలుగా ఉన్న కుకీ తెగలకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. 
 
ఈశాన్య రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. పైగా మణిపూర్‌లో మే 3 వ తేదీ నుంచి జరిగిన ఘటనలు ఇటీవల ఇంటర్నెట్ పునరుద్ధరించినప్పటి నుంచి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  అయితే తాజాగా జులై 23, 24 తేదీల్లో రెండు రోజుల్లోనే సుమారు 700 మందికిపైగా మయన్మార్ వాసులు మణిపూర్‌లో ప్రవేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు మణిపూర్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
 
అస్సాం రైఫిల్స్ సెక్టార్‌ 28 తెలిపిన వివరాల ప్రకారం 718 మంది మయన్మార్‌ వాసులు సోమ, మంగళ వారం రెండు రోజుల్లోనే  మణిపుర్‌లోని చందేల్‌ జిల్లాలోకి చేరుకున్నారు. వీరిలో 301 మంది చిన్న పిల్లలు, 208 మహిళలు, 209 మంది పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. వీరి దగ్గర సరైన ప్రయాణ పత్రాలు లేకుండానే మణిపూర్‌లోకి ప్రవేశించారని వెల్లడించింది. 
 
ఈ చొరబాట్లపై మణిపుర్‌ చీఫ్‌ సెక్రటరీ డా. వినీత్‌ జోషి స్పందించారు. అక్రమంగా మణిపూర్‌లోకి చొరబడిన వారిని వెంటనే వెనక్కి పంపించాలని అస్సాం రైఫిల్స్‌కు సూచించినట్లు తెలిపారు. వీసా, సంబంధిత పత్రాలు లేకుండా మయన్మార్‌ నుంచి ఎవరిని మణిపుర్‌లోకి అనుమతించవద్దని కేంద్ర హోం శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని చెప్పారు. 
 
ఒకవైపు మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్న వేళ మయన్మార్‌ నుంచి ఎవరినీ మణిపుర్‌లోకి అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం రైఫిల్స్‌కు తెలిపినట్లు డా. వినీత్‌ జోషి తెలిపారు. ఇప్పటికే మణిపూర్ ఆందోళనల్లో విదేశీ శక్తుల ప్రమేయం ఉన్నట్లు గత నెలలో ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. 
 
ఆందోళనకారులకు మయన్మార్‌ నుంచి ఆయుధాలు కూడా సరఫరా అవుతున్నట్లు గుర్తించాయి. ఇందులో భాగంగానే మయన్మార్‌ నుంచి మణిపుర్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఈ పరిమణాల మధ్య మయన్మార్‌ వాసులు సహా విదేశీయులు ఎవరైనా మణిపుర్‌లోకి ప్రవేశించడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసింది.